కార్యకలాపాలు ప్రారంభించకుంటే భూములు వెనక్కి తీసుకుంటాం: కంపెనీలకు కేటీఆర్ హెచ్చరిక

బుధవారం, 26 ఆగస్టు 2020 (05:21 IST)
నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించకుంటే, ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కంపెనీలను హెచ్చరించారు. పరిశ్రమల శాఖ పైన ఆ శాఖ మంత్రి కె.తారక రామారావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఇప్పటిదాకా పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పెట్టుబడులు తేస్తున్నామని, అయితే కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు.

ఈ మేరకు నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షో కాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. దీంతోపాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి కూడా సమీక్షించిన మంత్రి, ఇలా కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు.
 
దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చాలని ఇందుకోసం ఒక బ్లూ బుక్ ని తయారు చేయాలని సూచించారు. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారికి వివరాలు, పరిశ్రమల కేటగిరీలతో(సూక్ష్మ, యంయస్ యంఈ, ఇతర) పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తద్వారా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ వర్గాల్లో ఉన్న సమ్మిళిత స్ఫూర్తి తెలుస్తుందన్నారు. ఇలాంటి సమాచారంతో ప్రభుత్వం వద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటు ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. 
 
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పైన సమీక్ష
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన  ఈ-యస్ యఫ్ సి డిజిటల్ ప్లాట్ ఫామ్ ని లాంచ్ చేశారు. దీంతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, కార్పోరేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీని కోసం ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించిన మంత్రి ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. 
 
కాలుష్యరహితంగా హైదరాబాద్ ఫార్మాసిటీ- మంత్రి కె.తారక రామారావు
హైదరాబాద్ ఫార్మా సిటీపైన ఈ రోజు ఉన్నత స్ధాయి సమావేశం జరిగింది. టిఫైబర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామరావు నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్తో పాటు ఫైనాన్స్, పురపాలక, పరిశ్రమల ముఖ్యకార్యదర్శులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

ప్రస్తుతం ఫార్మాసిటీలో కొనసాగున్న మౌళిక వసతుల నిర్మాణం, కంపెనీల నుంచి వస్తున్న స్పందన వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఫార్మాసిటీ పనులు వేగంగా కొనసాగున్నాయని తెల్పిన పరిశ్రమల శాఖాధికారులు, ఫార్మసిటీకి పరిశ్రమల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. వందలాది కంపెనీల ఇప్పటికే ఫార్మాసిటీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్ధేశం చేసిన మంత్రి కెటియార్, ఫార్మాసిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఇచ్చిన అదేశం మేరకు ముందుకు పోదామన్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన మాస్టర్ ప్లానింగ్ తోపాటు, ఫార్మాసిటీ ద్వారా ఏలాంటి కాలుష్యం లేకుండా చూడాలన్నారు.

ఈ విషయంలో అంతర్జాతీయస్దాయి ప్రమాణాలతో ముందుకు పోయేందుకు ఇప్పటికే పరిశ్రమల శాఖాధికారులు పలు దేశాల్లోని ఫార్మా క్లస్టర్లను సందర్శించి వచ్చారన్నారు. ఇక్కడ వచ్చే ఫార్మాసిటీ సైతం అదేస్ధాయిలో ఉండాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే పరిశ్రమల శాఖ చర్యలు తీసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

విండ్ ప్లో అధ్యాయనం సైతం చేసినట్లు, అమేరకే మాస్టర్ ప్లానింగ్ ఉందన్నారు. దీంతోపాటు ఫార్మా సిటీలో ఫార్మ యూనిట్లు అత్యదిక శాతం జిరో లిక్విడ్ డిచ్చార్జ్ యూనిట్లు ఉంటాయన్న కెటియార్, ఫార్మా సిటి వ్యర్ధ్యాలను కేంద్రీకృతంగా శుద్దీ జరిగేలా ఎర్పాట్లు ఉంటాయన్నారు. తద్వారా వ్యర్ధాల శుద్ది విషయంలో అత్యుత్తమ ప్రమాణాలతోపాటు, కంపెనీల విచక్షణ లేకుండా పటిష్టంగా జరుగుతుందన్నారు.

ఇలా ఫార్మసిటీ కాలుష్యం భయం లేకుండా ఉంటుందన్నారు. దీంతోపాటు ఫార్మసిటీ ఏర్పాటు లివ్, వర్క్, లెర్న్ స్పూర్తితో ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అందులో పనిచేసేవారికి అక్కడే నివాస సౌకర్యాలుంటాయన్నారు. ఫార్మాసిటీకి అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్ధలు ఎర్పడతాయన్నారు. 

ఈ సమావేశంలో మరోసారి స్దానికులకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని చర్చించారు. దీనికోసం స్దానిక శిక్షణ కేంద్రాల ఎర్పాటుపైన చర్చించారు. పరిశ్రమల శాఖ, జిల్లా యంత్రాంగం ఇందుకోసం కలిసి పనిచేయాలని సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు