పూర్తికాని పనులు.. ఈ నెల 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు...

సోమవారం, 10 జులై 2023 (14:38 IST)
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునకరీకరణ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు గుంటూరు - విశాఖపట్టణం, 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కాకినాడ - విశాఖ - కాకినాడ, రాజమండ్రి - విశాఖ - రాజమండ్రి ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు ఆయన తెలిపారు. 
 
11, 14, 15 తేదీల్లో ధన్‌బాద్ - ఆళప్పుళ బొకారో ఎక్స్‌ప్రెస్ రైలును, 11, 14న హతియా - ఎస్‌ఎంబీ బెంగుళూరు రైలు, 15న  హతియా - ఎస్ఎంవీ బెంగుళూరు రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వివరించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని త్రిపాఠి కోరారు. 
 
మరోవైపు, సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కార్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.
 
దక్షిణ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, కాజీపేట-డోర్నకల్ (07753), డోర్నకల్-కాజీపేట మెము (07754), డోర్నకల్-విజయవాడ (07755), విజయవాడ-డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్-విజయవాడ (07278), విజయవాడ-భద్రాచలం రోడ్ (07979), సికింద్రాబాద్-వరంగల్ (07462), వరంగల్-హైదరాబాద్ మెము (07463), కాజీపేట-సిర్పూరు టౌన్ (17003), 'బల్లార్షా - కాజీపేట రాంగిరి మెమో (17004), భద్రాచలం రోడ్ - బల్లార్షా(17033), సిర్పూరు టౌన్ - భద్రాచలం రోడ్ (17034) ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు