మాస్క్ లేకపోతే జరిమానా తప్పదు : నల్లగొండ ఎస్పీ

గురువారం, 9 జులై 2020 (16:51 IST)
కోవిడ్ - 19 నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించకపోతే జరిమానాలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ. ఏ. వీ. రంగనాథ్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని, బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాస్కులు ధరించకుండా బయటికి వచ్చే వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించని పలువురికి జిల్లా వ్యాప్తంగా జరిమానాలు విధించడం జరిగిందని చెప్పారు. కరోనా కేసులు జిల్లాలో పెరిగిపోతున్న క్రమంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు.

ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాస్కులు ధరించని 599 మందికి జరిమానాలు విధించడం జరిగిందని ఆయన తెలిపారు.

జిల్లాలోని  ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, బయటికి వస్తే మాస్క్ విధిగా ధరించాలని, కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్న పోలీస్, వైద్య శాఖ, సానిటరీ సిబ్బందితో ప్రజలంతా సహకరించాలని ఆయన సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు