సంక్రాంతి రేసు నుంచి "రౌద్రం - రణం - రుధిరం" ఔట్?

శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:52 IST)
డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "రౌద్రం - రణం - రుధిరం" (ఆర్ఆర్ఆర్). టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుంటే, ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. కానీ, కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. 
 
నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఈ యేడాది జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురావాల్సివుంది. కానీ, షూటింగ్, హీరోయిన్ల ఎంపిక ఆలస్యం కావడంతో ఈ చిత్రం విడుదలను వచ్చే యేడాది సంక్రాంతికి వాయిదావేశారు. అయితే, ఇపుడు కరోనా ఎఫెక్టుతో పాటు పలు కారణాల వల్ల విడుదల సంక్రాంతికి కూడా అనుమానంగా మారింది. 
 
ఈ చిత్రంలో యూరప్‌కు చెందిన ముగ్గురు నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పట్లో కుదిరే పని కాదు. కాబట్టి వీరు షూటింగ్‌కు హాజరవడం కష్టం. ఇక, ఈ సినిమాకు పనిచేసే గ్రాఫిక్స్ కంపెనీలు కూడా మూతబడ్డాయి. 
 
అమెరికా, యూరప్‌ల్లోని కంపెనీలకే మేజర్ గ్రాఫిక్స్ వర్క్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పట్లో అవి వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నింటి దృష్ట్యా 'ఆర్ఆర్ఆర్' విడుదల సంక్రాంతికి సాధ్యపడదని అంటున్నారు. వచ్చే ఏడాది వేసవికే విడుదల కావొచ్చని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు