రియా చక్రవర్తి ఫ్యామిలీ మిస్సింగ్... అర్థరాత్రి సూట్‌కేసులతో జంప్???

సోమవారం, 3 ఆగస్టు 2020 (07:53 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సినీ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు కనిపించడం లేదు. సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా, రియా చక్రవర్తి ఇంటికి బీహార్ పోలీసులు వెళ్ళగా ఈ విషయం బయటపడింది. నాలుగు రోజుల క్రితం పెద్ద పెద్ద సూట్‌కేసులను వెంటతీసుకుని అర్థరాత్రి పూట కారులో వెళ్లినట్టు ఓ జాతీయ చానెల్ చెబుతోంది. 
 
కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో రియా గురించి రోజుకో విషయం వెలుగు చూస్తోంది. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు రియా ఓ అజ్ఞాత ఖాతాకు బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో ముంబైలోని రియా చక్రవర్తి ఇంటికి విచారణ నిమిత్తం బీహార్ పోలీసు బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.
 
ఓ జాతీయ టీవీ ఛానల్ రియా ఇల్లు సూపర్‌వైజర్‌ను ఈ విషయమై సంప్రదించగా షాకింగ్ విషయం బయటికొచ్చింది. మూడు రోజుల క్రితం రియా అర్థరాత్రి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. బ్లూ కలర్ కారులో వెళ్ళారని, పెద్దపెద్ద సూట్‌కేసులను వెంట తీసుకెళ్లారని తెలిపాడు. రియా ఉంటున్న ఈ ఇంటికి సుశాంత్ ఒకప్పుడు వచ్చాడని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు