కబ్జా స్థలంలో హీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్? నిజమా?

శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలో హీరో ప్రభాస్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌ను అధికారులు జప్తు చేశారు. దీంతో టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరారు. 
 
తాను ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవిరెడ్డి, ఉషా, బొమ్మి రెడ్డి శశాంక్‌ రెడ్డిల నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారించింది.
 
ఈ భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. ఇందుకోసం రూ.1.05 కోట్ల ఫీజును కూడా చెల్లించినట్టు వెల్లడించారు. ఈ దరఖాస్తు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. రెవెన్యూ అధికారులు తమ భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
 
కానీ, రెవెన్యూ అధికారులు మాత్రం ఈ ఇల్లు ప్రభుత్వ స్థలంలోనే ఉందంటూ బల్లగుద్దివాదిస్తున్నారు. అందుకే సీజ్ చేసినట్టు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. రాయదుర్గంలోని పైగా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆ స్థలంలో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్‌ చేసినట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు