టైం అంటే ఇదేనేమో.. పాపం.. "సమరసింహా రెడ్డి" నిర్మాత...

శనివారం, 30 జూన్ 2018 (14:57 IST)
యువరత్న బాలకృష్ణను సీమ సింహంలా, సినీ ఇండస్ట్రీకి రాయలసీమ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వ్యక్తి చెంగల వెంకట్రావ్. ఈయన నిర్మాతగా, బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం 'సమరసింహా రెడ్డి'. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. అలాంటి చిత్రాన్ని అందించిన చెంగల వెంకట్రావు ఇపుడు ఏ ఒక్కరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చుట్టూ హీరోలు, హీరోయిన్స్ ఎంతో కలర్‌ఫుల్ జీవితాన్ని అనుభవించిన చెంగల... ఇపుడు మాసిన గెడ్డం, చిరిగిన బనియన్‌, చింపిరు జుట్టుతో కనిపిస్తున్నారు.
 
బాలకృష్ణతో 'సమరసింహా రెడ్డి' చిత్రం నిర్మించిన తర్వాత అదే ఇమేజ్‌తో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దూకుడు స్వభావం ఉండే చెంగల వెంకట్రావ్‌.. 2007లో జరిగిన ఓ ఘర్షణల్లో నిందితుడు. ఈ ఘర్షణల్లో ఓ మత్స్యుకారుడు చనిపోయాడు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన చెంగల వెంకట్రావ్ ఓడిపోయారు. అప్పటినుంచి టీడీపీకి దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. ఆ వెంటనే.. 2007లో జరిగిన ఘర్షణ కేసులో అనకాపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఈ కేసులో తీర్పు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో 21 మందికి యావజ్జీవ శిక్ష విధించారు. 
 
అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల ఆయన కుమారుడి అనారోగ్యం కారణంగా ఆరు నెలలు బెయిల్‌పై బయటకు వచ్చి.. ఇటీవలే మళ్లీ జైల్లోకి వెళ్లారు. చెంగల వెంకట్రావ్ అనారోగ్యానికి గురవ్వటంతో ఆయనను విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా సాధారణ ఖైదీలను ఉంచే సెల్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. 
 
ఈపరిస్థితుల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చారు. డెంగీ బాధితులను పరామర్శిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత చెంగల వెంకట్రావ్ కూడా ఉన్నారు. ఆయనను చూసి కలెక్టర్ కూడా గుర్తించలేకపోయారు. సాధారణ ఖైదీ అనుకున్నారు. వివరాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ఒంటిపై బనీను, మాసిన గడ్డం, చెరిగిన జుట్టుతో ఉన్న చెంగలను చూసి ఔరా అనుకున్నారు. టైం అంటే ఇదేనేమో.. పాతాళానికి పడిపోవటం అంటే ఇదేనేమో కదా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు