బాగా క్షీణించిన ఎస్పీబీ ఆరోగ్యం.. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు.. అభిమానులు

గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:47 IST)
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా నిలగడగా ఉన్న ఎస్పీబీ ఆరోగ్యం గత 24 గంటల్లో ఉన్నట్టుండి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు.
 
ఎస్పీబీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆగస్టు 5వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా క్షీణించిందని, ఆయనకు అత్యున్నత స్థాయిలో లైఫ్ సపోర్ట్ సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
 
ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఎంజీఎం ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని ఎంజీఎం ఆసుపత్రి వైద్య సేవల ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ పేరిట విడుదలైన ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.
 
నిజానికి ఎస్పీబీ తనయుడు ఎస్.పి. చరణ్ రెండు రోజుల క్రితం కూడా తన తండ్రి బాగానే ఉన్నారంటూ తెలిపారు. చరణ్ గత కొన్నిరోజులుగా ఎంతో సానుకూల రీతిలో తండ్రి ఆరోగ్యంపై అప్ డేట్లు ఇస్తుండటంతో అభిమానులు ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు.
 
కాగా, ఎస్పీబీ ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, ఎస్పీబీ అభిమానులు ఆస్పత్రికి చేరుకుంటున్నాయి. తమ అభిమాన గాయకుడు తిరిగి కోలుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు