స‌హ‌జ‌మైన ప్రేమ‌క‌థ క‌ల‌ర్ ఫొటో, మన ఊరిలో ఇలాంటి ప్రేమజంట వుంటే?

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (19:08 IST)
విడుదల తేదీ : అక్టోబర్ 23, 2020
రేటింగ్ : 3/5
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, ‘వైవా’ హర్ష, శ్రీవిద్య తదితరులు,
సాంకేతిక‌తః సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి, మ్యూజిక్: కాల భైరవ, నిర్మాత: సాయి రాజేష్ నీలం, బన్నీ ముప్పానేని, దర్శకత్వం : సందీప్ రాజ్
 
క‌ల‌ర్ ఫొటో.. అనే పేరుతోనే కొత్త‌ద‌నానికి తావిచ్చిన ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్..  ఏజెంట్ ఆచార్య ఆత్రేయ‌తో పాటు ‘పడి పడి లేచె మనసు’, ‘మజిలీ’ సినిమాల్లో కేర‌క్ట‌ర్ న‌టుడిగా క‌థానాయ‌కుడిగా చేశాడు. పోస్ట‌ర్లు చూసేస‌రికి ఇది ఫ‌క్తు నాచురాలిటీ సినిమాగా మారింది. ఈ చిత్రం శుక్ర‌వారంనాడు సినిమా ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అయింది. చాందిని చౌదరి హీరోయిన్. ఆమెకు అన్నయ్యగా విలన్ పాత్రలో సునీల్ నటించారు. మీడియాకి స్పెషల్‌గా షో వేశారు. అది చూసి రివ్యూ ఇస్తున్నాం!
 
కథ:
జయకృష్ణ (సుహాస్) ఇల్ల‌ిల్లూ తిరుగుతూ పాలుపోస్తుంటాడు. త‌ల్లి లేక‌పోవ‌డంతో తండ్రికి చేదోడు వాదోడుగా వుంటాడు. అలా అని చ‌దువు నిర్ల‌క్ష్యం చేయ‌డు. మచిలీప‌ట్నంలో కాలేజీలో చ‌దువుతుంటాడు. రంగు న‌లువైనా మ‌న‌స్సు మంచింది. అదే కాలేజీలో చ‌దివే తెల్ల‌టి అమ్మాయి దీప్తి (చాందిని చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. కానీ, అమ్మాయికి విషయం చెప్పడు. నల్లగా ఉన్నానని నో అంటుందేమో అని మనసులో ఫీలింగ్ దాచుకుంటాడు.
 
సీనియర్లు జయకృష్ణని బలిపశువును చేసి కాలేజీలో అందరి ముందు కొట్టడంతో దీపుతో పరిచయం ఏర్పడుతుంది. అత‌ని అమాయ‌క‌త్వం, మంచి మ‌న‌స్సు చూసి త‌నూ ప్రేమిస్తుంది. ఈ విషయం ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం అయిన దీపు అన్నయ్య ఎస్సై రామరాజు(సునీల్)కి తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణః
చ‌క్క‌టి గ్రామీణ వాతావ‌ర‌ణంలో ప్రేమ‌క‌థ అన‌గానే చాలానే చూసేశాం అని ఫీలింగ్ క‌లుగుతుంది. కానీ క‌థ‌నం పోనుపోను ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఎక్క‌డా అనుక‌ర‌ణ క‌న్పించ‌దు. పోలిక అస్స‌లు తెలీదు. చిన్న ప‌ట్ట‌ణంలో వుండే కాలేజీ వాతావ‌ర‌ణం, విద్యార్థుల న‌డ‌వ‌డిక క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు. చెప్ప‌డానికి న‌ల్ల‌నోడు తెల్ల‌టి అమ్మాయి ప్రేమ‌క‌థ‌. దాన్ని ప్రేక్ష‌కుడు చూసేవిధంగా ద‌ర్శ‌కుడు క‌ట్టిప‌డేశాడ‌నే చెప్పాలి. క‌థాప‌రంగా సుహాన్ ఎన్నుకోవ‌డం బ‌లం. ఇలాంటి వ్య‌క్త‌లు చాలామందే మ‌న చుట్టుప‌క్క‌ల క‌నిపిస్తారు.
 
మొహంలో పెద్ద‌గా ఎక్సుప్రెష‌న్ ప‌లిక‌వ‌నేది హీరో పాత్ర‌ప‌రంగా ద‌ర్శ‌కుడు రాసుకున్నాడు. ఇక విల‌న్‌గా సినిమాలోకి అరంగేట్రం చేయాల‌నుకున్న సునీల్‌కు ఈ సినిమా అవ‌కాశం క‌ల్పించింది. ప్రేమికులు ఎమోష‌న్సు, స్నేహితుల సంబంధాలు న‌డ‌క‌లోనే ద‌ర్శ‌కుడు హాస్యాన్ని చొప్పించాడు. కథానాయికగా నటించిన చాందిని చౌదరి నాచురల్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంది. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. క్లైమాక్స్ సీన్లలో ఆడియన్స్‌ని ఏడిపిస్తుంది. సునీల్ డిఫరెంట్ విలనిజం చూపించాడు. వైవా హర్ష తన కామెడీ టైమింగ్, డైలాగులతో ఆకట్టుకున్నాడు. సునీల్ వైఫ్ క్యారెక్టర్లో శ్రీవిద్య, హీరోయిన్ ఫ్రెండ్‌గా దివ్య పాత్ర పరిధి మేరకు నటించారు. హీరో తండ్రిగా కేరాఫ్ కంచ‌ర‌పాలెంలో న‌టించిన వ్య‌క్తి న‌టించాడు. కాలేజీ హెడ్‌గా ద‌ర్శ‌కుడు సాయికార్తీక్ న‌టించాడు.
 
ఇక సంగీత ద‌ర్శ‌కుడు కాలభైరవ సినిమాను నిల‌బెట్టాడు. క‌థ‌తోసాగే పాట‌ల‌కు, నేప‌థ్య సంగీతానికి అనుగుణంగా త‌ను మ‌ల‌చుకున్నాడు. నేపథ్య సంగీతం సన్నివేశాల్లో ఎమోషన్ ఎలివేట్ చేసేలా ఉంది. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది.
 
రొటీన్‌గా వ‌స్తున్న ప్రేమ‌క‌థ‌ల‌కు భిన్నంగా క‌ల‌ర్ ఫొటో వుంది. విల‌న్ల ఆవేశాలు, అరుపులు, కేక‌లు లేకుండా నీట్‌గా వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను చూస్తుట్లుగా తీయ‌డం ద‌ర్శ‌కుడు ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. మ‌ధ్య‌లో ఆర్టు సినిమా ఛాయ‌లుగా అనిపించినా వెంట‌నే మామూలు సినిమాగా సాగుతుంది. ఎక్క‌డ ఎలా చూపించాలో అక్క‌డ అలా చూపించే ప్ర‌య‌త్నం జ‌రిగింది.
 
యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా. కొత్త త‌ర‌హా క‌థ‌లు కావాల‌నుకుంటున్న వారికి ఈ చిత్రం ఆట‌విడుపుగా అనిపిస్తుంది. అయితే ప్రేమ క‌థ‌లు అన‌గానే రాజు, పేద‌, ఉన్న‌వాడు లేనివాడు.. ఇలాంటి ఫార్మెట్‌ల‌కు అల‌వాటు చేసినా.. ఇది అలా అనిపించ‌దు. సంభాష‌ణ‌ల‌ప‌రంగా నాచుర‌ల్‌గా రాశాడు. అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది.. త‌ను ప్రేమించిన వ్య‌క్తి మ‌ళ్లీ మ‌ళ్లా చూస్తున్నాడా లేదా ..అని ఆలోచిస్తార‌ని.. ఇలా.. సంద‌ర్భానుసారంగా బాగున్నాయి.
 
మ‌న‌ల్ని పాలించిన బ్రిటీషోడు తెల్ల‌గా వుంటాడు కాబ‌ట్టి.. మ‌నం లైక్ చేస్తున్నాం.. అదే న‌ల్ల‌వాడు చేస్తే...? ఎలా వుంటుంది.. అనే కాలేజీ స్పీచ్ డైలాగులు బాగున్నాయి. నాచుర‌ల్‌గా వుండే క‌థ కాబ‌ట్టి.. అందుకు త‌గినట్లు చిన్న‌పాటి ద్వంద్వార్థాలు లేక‌పోలేదు. అయినా అవి పెద్ద‌గా ఎబ్బెట్టు అనిపించ‌వు. ఇక హీరోయిన్ కేవ‌లం జాలిప‌డే ప్రేమించిన‌ట్లుగా అనిపిస్తుంది మిన‌హా ఎక్క‌డా బ‌ల‌మైన కార‌ణం క‌నిపించ‌దు. దాంతో అంత‌గా కనెక్ట్ కాలేరు. ఫస్టాఫ్ డీసెంట్‌గా స్టార్ట్ అయినప్పటికీ తరువాత తరువాత సాగదీసినట్టు అనిపిస్తుంది.  
 
సాంకేతిక విభాగం:
స్టోరీలోని లవ్ ఫీల్‌ని డైరెక్టర్ కంప్లీట్‌గా ఎలివేట్ చెయ్యలేకపోయాడు. ఎమోషనల్ సీన్లు బాగా హ్యాండిల్ చేశాడు. వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను అందంగా, పెయింటింగ్‌లా చూపించారు. ముందు చెప్పుకున్నట్టు కాలభైరవ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ముందు సాగదీత సన్నివేశాలను కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.
 
తీర్పు:
క‌థ‌కు త‌గిన టైటిల్ పెట్టిన ఈ చిత్రం హృద‌‌యాన్ని ట‌చ్ చేసే స‌న్నివేశాల‌తో సాగుతుంది కాబ‌ట్టి పీస్ ఆఫ్ మైండ్‌తోనే చూడాలి. ఓటీటీలోనే కాబ‌ట్టి మ‌న‌కు న‌చ్చినట్లుగా ఫార్వార్డ్ చేసుకుంటూ చూడవచ్చు.
-డివి
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు