పాలనంతా ఒకే చోట ఉండాలి.. అడిగితే కేంద్రానికి ఇదే చెబుతా : వెంకయ్య

గురువారం, 26 డిశెంబరు 2019 (12:36 IST)
నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, అమరావతిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదంటూ 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో విజయవాడలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం మంచిదేనని చెప్పారు. అయితే, పాలన అంతా ఒకే చోట ఉండాలన్నది తన అభిప్రాయమన్నారు. 
 
ఈ రోజు పాలనా సౌలభ్యం కోసం రాజధానిలో అన్నీ ఒకే చోట ఉండాలని సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయాలు ఒక్కచోట ఉంటేనే పరిపాలన సజావుగా సాగేందుకు వీలవుతుందని చెప్పారు. 
 
బుధవారం రాజధాని రైతులు తన వద్దకు వచ్చారని, వారి గోడు విన్నాక తన మనసు చలించిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప, పాలన కేంద్రీకృతంగానే ఉండాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు. 
 
ఇక రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయం కేంద్రం అడిగితే ఇదే చెబుతానని తెలిపారు. రాజకీయ అంశాలు, వివాదాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్నందున తన దృష్టికి వచ్చినవాటిపై అవసరమైన మేరకే స్పందిస్తానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు