లడఖ్‌లో పర్యటించనున్న ఇండియన్ ఆర్మీ చీఫ్

సోమవారం, 22 జూన్ 2020 (14:13 IST)
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. చైనా బలగాలు హద్దుమీరి భారత భూభాగంలోకి ప్రవేశించి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే లడఖ్‌లో పర్యటించనున్నారు. 
 
ఈయన అక్కడ గ్రౌండ్ కమాండర్లతో సమావేశమౌతారు. వాస్తవాధీన రేఖ వెంబడి తాజా పరిస్థితులపై సమీక్ష జరుపుతారు. చైనాతో ఉద్రిక్తతల వేళ నరవణే లడక్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ భదౌరియా పర్యటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, తమ పర్యటనలో భాగంగా, నరవణే లడఖ్ గల్వాన్ లోయలో చైనా పాశవిక దాడిలో గాయపడి ఆర్మీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న భారత సైనికులను పరామర్శిస్తారు. 
 
కాగా, జూన్ 15వ తేదీన లడఖ్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా కుట్రపూరితంగా భారత జవాన్లపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 
 
అటు చైనా తరపున కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినా డ్రాగన్ కంట్రీ ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మరోవైపు గల్వాన్ లోయలో చైనా కుట్రపూరిత దాడి నేపథ్యంలో త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్చనిచ్చింది. దాడి చేస్తే ప్రతిదాడి చేయాలనే సంకేతాలు పంపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు