రైలు కిందపడి కర్నాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య!!

మంగళవారం, 29 డిశెంబరు 2020 (08:52 IST)
కర్నాటక రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఎల్.ధర్మెగౌడ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ధర్మెగౌడ ఆచూకీ ఆ తర్వాత తెలియరాలేదు. దీంతో పోలీసులు,  గన్‌మెన్ ఆయన కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలూకా గుణసాగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీంతో రైలు కిందపడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
అయితే, మృతదేహం పక్కనే ఉన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. కాగా, ఈ నెల 16వ తేదీన శాసనమండలి ఛైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో రభస జరిగింది. 
 
మండలి సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లిపోయారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ఇప్పుడు ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు