నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన

శనివారం, 8 మే 2010 (19:54 IST)
సర్వాంగాసన అనే పదం సంస్కృత భాషలో నుంచి వచ్చింది. సర్వ, అంగ, ఆసన అనే మూడు పదాల కలయికే సర్వాంగాసన. సర్వ అంటే అన్ని, అంగ అంటే శరీరంలోని భాగాలు, ఆసన అంటే యోగ పరమైన భంగిమ. సర్వాంగాసన అంటే శరీరంలోని అన్ని భాగాలతో కలిసి చేసే యోగ భంగిమ.

చేసే విధానం
1. సమతల ప్రాంతంపై పడుకుని శరీరాన్ని సమాంతరంగా ఉంచండి. కాళ్లను పైకి చాపి చేతులను వదులుగా ఉంచాలి. అరచేతులను భూమికి ఆన్చాలి.

2. గాలి పీలుస్తూనే మోకాళ్లను ఛాతీ సమీపానికి తీసుకురావాలి. అరచేతులను వెనక్కు తిప్పాలి. తొడలను పైకిలేపే సమయంలో పిర్రలకు సహాయంగా అరచేతులు ఆన్చాలి.

3. అరచేతులను తొడల లోపలికి పోనిచ్చి మోకాళ్లను నుదురు సమీపానికి తీసుకురావాలి. ఈ సమయంలో కాళ్లను నేరుగా పైకి ఎత్తాలి.

4. ఊపిరి వదులుతూ వెన్ను, కాళ్లను నేరుగా ఉంచుతూనే మోచేతులను భుజాలకు సమాంతరంగా లేపాలి. కాళ్లను నేరుగా పైకి చాపి కాలి వేళ్లను సడలించాలి. వీటితోపాటే కాళ్లు, శరీరాన్ని కొద్దిగా సడలించాలి.

5. అరచేతులను భుజాల మీదకు తీసుకురావాలి.

6. ఊపిరి తీసుకుంటూనే భంగిమ నుంచి సాధారణ స్థితికి రావాలి. ఊపిరి వదులుతూ మోకాళ్లను వంచుతూ ఛాతీ మీదకు తీసుకురావాలి. చిన్నగా తొడలను కిందకు దించుతూ పిరుదులను నేలకు ఆన్చాలి. కాళ్లను నిటారుగా ఉంచి చేతులను సడలించాలి.

ఉపయోగాలు
థైరాయిడ్ గ్లాండ్‌ను ఉత్తేజితం చేస్తుంది.
వెన్నెముకను సరిచేస్తుంది.
నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది.
పొత్తి కడుపు భాగాలను ఉత్తేజితం చేస్తుంది.

WD
జాగ్రత్తలు
అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఈ ఆసనం జోలికి పోవద్దు.
మెడ, భుజం, వెన్నెముక కింది భాగం, కటి భాగంలో సమస్యలు ఉన్నట్లయితే ఈ ఆసనంను పాటింటచవద్దు.
రుతు సమస్య ఉన్నప్పుడు ఈ భంగిమను అనుసరించవద్దు.

వెబ్దునియా పై చదవండి