మోడీ, జగన్‌కు రాఖీ కట్టి నిరసన తెలిపిన అమరావతి మహిళలు

సోమవారం, 3 ఆగస్టు 2020 (20:00 IST)
అన్నగా, తమ్ముడిగా ఆదుకోవాల్సిన వారే మాట తప్పి మహిళలతో కన్నీరు పెట్టిస్తున్నాడని రాఖీ పండుగ రోజున అయినా సోదరీమణుల ఆవేదన ప్రధాని మోడీ, సిఎం జగన్మో హన్ రెడ్డి అర్ధం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎస్ఎఫ్ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ కోరారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని రాష్ట్ర జెఏసీ కార్యలయంలో “రాఖీ ప్రొటెస్ట్” కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడి, సిఎం జగన్మోహన్ రెడ్డిల ఫొటోలకు రాఖీలు కట్టి నిరసన తెలిపారు.

అనంతరం దుర్గా భవానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజధాని అంశాన్ని ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తూ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను కేంద్రం ప్రోత్సహిస్తుందని, నా అక్క చెల్లి అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారినే మోసం చేశారని వాపోయారు.

మేము సిఎంను కలిసి విజ్ఞప్తి చేసే పరిస్థితి లేదు.. అపాయింట్మెంట్ ఇవ్వరు కాబట్టే ఇలా రాఖీలు కట్టి మా ఆవేదన ను అర్ధం చేసుకోవాలని కోరుతున్నా మన్నారు. మహిళల కన్నీరు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదన్నారు. 
 
కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ సిఆర్డిఎ చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వానికి అక్కడ కూర్చుని పాలించే హక్కు లేదన్నారు. మోడీ, జగన్లు ఎపికి తీరని ద్రోహం చేశారని, అమరావతి కోసం పోరాడుతున్న మహిళల కన్నీరు పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా ఉంచాలనే మోడీ, జగన్లకు ఈరోజు రాఖీలు కట్టాం అన్నారు. మీ స్వార్ధం, రాజకీయ లబ్ధి కోసం రాజధానులను ముక్కలు చేయడం సరి కాదని గతంలో ఎన్నడూ జగన్ అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేదన్నారు. 33వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది నిజం కాదా!

ప్రధాని హోదాలో మోడీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని చంపేయడం న్యాయమా అన్నారు. రాజధానిని మార్చిన విధంగానే సిఎం , మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేసారు. బిజెపి కూడా ద్వంద్వ విధానాలు వీడి రైతుల పక్షాల నిలబడాలని కోరారు.

రైతులను జగన్ నేరుగా పొడిస్తే... బిజెపి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజధాని రైతులకు అండగా ఉంటామని ప్రకటించడం హర్షణీయం.. ఆయన కూడా మాతో కలిసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. రాజధాని అమరావతి అని పున:ప్రకటించే వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు.
 
మాజీ జెడ్ పిటీసి ఛైర్మన్, తెదేపా నాయకురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ రాఖీ పండుగ సమయంలో రాజధాని మహిళలు రోధిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన స్వార్థం కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒక్క రాజధానికే దిక్కు లేకుంటే మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.

కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇటువంటి సమయంలో రాజధాని మార్చి.. మోసం చేశారన్నారు. మోడీ, జగన్లు చరిత్రకారులుగా ఉండాలే తప్ప, చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని సూచించారు.

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకంతో ముందుకెళుతున్నామని, 33వేల ఎకరాలను ఇచ్చిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దేనేపూడి రమాదేవి, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు