బడి బయట పిల్లలు ఉంటే ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తా : ప్రవీణ్ ప్రకాష్

శనివారం, 26 ఆగస్టు 2023 (14:22 IST)
సెప్టెంబరు నాలుగో తేదీ తర్వాత నుంచి బడి బయట పిల్లలు ఉంటే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు. 2005 సెప్టెంబరు, 2018 ఆగస్టు మధ్య జన్మించిన పిల్లలందరూ విద్యాలయాల్లో ఉండాలని, వీరిలో ఏ ఒక్క బాలుడు, బాలికైనా విద్యాలయానికి వెళ్లకుండా ఉంటే తన ఐఏఎస్ పదవిని వదిలేస్తానని ప్రకటనలో వెల్లడించారు. 
 
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, జిల్లా అధికారులు అందరూ కలిసి సెప్టెంబరు 4వ తేదీలోపు వంద శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్) సాధించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,993 మంది వాలంటీర్లు వంద శాతం జీఈఆర్ పూర్తి చేశారని.. 464 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వంద శాతం పిల్లలు చదువుకుంటున్నారని ప్రకటించారు. 
 
ఇది అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు, మండలాలు, జిల్లాల్లోనూ పూర్తి కావాలని పేర్కొన్నారు. వంద శాతం జీఈఆర్ పూర్తయ్యాక డేటాబేస్ తప్పు ఉందనిగాని, ఏ పిల్లలైనా ఈ డేటాబేస్‌లో లేరనిగానీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తెలిపారు. ప్రపంచంలో వంద శాతం జీఈఆర్ సాధించిన రాష్ట్రంగా ఏపీ అవతరించాలన్నారు. 'ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో ఉంది. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది. ఐదేళ్లనుంచి 18 ఏళ్ల వరకు ప్రతి ఒక్క విద్యార్థి ఏదైనా పాఠశాలలోగాని, ఓపెన్ స్కూల్, స్కిల్ సెంటర్లు, కళాశాలల్లోగానీ ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి' ఆయన సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు