టీడీపీకి జైకొట్టారని 33 మంది వలంటీర్లపై వేటు - వైకాపా మద్దతు వీఆర్వో సస్పెన్షన్

ఠాగూర్

సోమవారం, 18 మార్చి 2024 (12:42 IST)
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఏపీలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా వైకాపా నేతలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోపై వేటుపడింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే, తాజాగా 33 మంది వలంటీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రభుత్వం అప్పగించిన పనులు సక్రమంగా అమలు చేయడం లేదన్న సాకుతో వారిపై చర్య చేపట్టింది. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వారిని తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 
 
వేటుకు గురైన వలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురు ఉన్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 
 
అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించినందుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగిపై తొలివేటు పడింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వో రమేశ్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అధికార వైకాపా పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో రమేశ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వార్తలు పత్రికల్లో వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. ఈ విచారణలో రమేశ్ వైకాపా ప్రచారంలో పాల్గొన్నట్టు తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు