'రీస్టార్ట్ పాలసీ'లో రాయితీల కోసం దరఖాస్తు చేసుకోండి: కృష్ణా కలెక్టర్‌

శనివారం, 27 జూన్ 2020 (07:55 IST)
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) బలోపేతం కోసం ప్రవేశపెట్టిన 'రీస్టార్ట్' పాలసీలో రాయితీలు పొందేందుకు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.ఎం.డి. ఇంతియాజ్ కోరారు.

స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి కమిటీ సమావేశానికి కలెక్టరు ఇంతియాజ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపద్యంలో పరిశ్ర‌మలు మూతబడి తిరిగి పునరుద్ధరించుకోవడంలో సమస్యలను అధిగమించేందుకు రీస్టార్ట్ కింద ప్రభుత్వం మే 19వ తేదీన జి.ఓ.నెం. 104 ద్వారా కొన్ని రాయితీలను ప్రకటించడం జరిగిందన్నారు.

ఈమేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలలో చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీలలో స్థిర విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా భారీ పరిశ్రమలకు బిల్లుల చెల్లింపు 3 నెలల పాటు వాయిదానిస్తూ ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగిందన్నారు. అందుకు సంబంధించి ఏప్రిల్, మే, జూన్ బిల్లులను ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో చెల్లించే వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు.

ఎంఎస్ఎంఇలకు నిర్వహణ మూలధనం కింద రూ.2 నుండి రూ.8 లక్షల వరకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ నిర్వహణ మూలధనం రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ కొనుగోళ్ళలో 25 శాతం ఎంఎస్ఎంఇల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న రాయితీలను ప్రభుత్వం ప్రకటించిన ఇతర సౌకర్యాలను పొందేందుకు జూన్ 30 వ తేదీలోపు https://www.apindustries.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టరు ఇంతియాజ్ కోరారు.

దరఖాస్తు చేసుకొనేవారు పాన్, ఆధార్ కార్డులు, పెద్ద పరిశ్రమలకు ఐఇఎం పార్టు-బి, మెగా యూనిట్లకు ఇఎం పార్ట్-2 ఎక్నాలజ్జిమెంటు, అక్టోబరు 2019 నుండి జనవరి 2020 వరకు గల 4 నెలల విద్యుత్ వినియోగ బిల్లులు అవసరమైనచోట జిఎస్ సర్టిఫికెట్లను జతచేయవలసి ఉంటుందని అన్నారు. 

దీర్ఘ కాలంగా ఎంఎస్ఎంఇలకు తదితరులకు బకాయిలను గత నెలలో చెల్లించుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కలెక్టరు అన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఇలకు 904 కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించగా మే నెలలో రు.450 కోట్లు చెల్లించగా జూన్ 29న మిగిలిన సొమ్ము ప్రభుత్వం చెల్లించనున్నట్లు చెప్పారు.

జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ కింద ఇంతవరకు 4608 దరఖాస్తులు రాగా వాటిలో 4450 దరఖాస్తులకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా 56 పరిశ్రమలకు సంబందించి వివిధ రాయితీలకు సమావేశం ఆమోదం తెలిపింది.

ఇందులో పెట్టుబడి రాయితీ కింద 35 ప్రతిపాదనలకు రూ.1.91 కోట్లు, వడ్డీ రాయితీ కింద 11 ప్రతిపాదనలకు రూ.87,90 లక్షలు, విద్యుత్ రాయితీ కింద 8 ప్రతిపాదనలకు రూ.55.45 లక్షలు, సేల్స్ టాక్సు రాయితీ కింద 2 ప్రతిపాదనలకు రూ.18.59 లక్షలు ఉన్నాయి.

సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుధాకర్, కాలుష్య నియంత్రణా మండలి ఈఈ మురళి, పరిశ్రమల సంఘాల త‌ర‌ఫున వి.మురళీకృష్ణ, డి.బుజ్జిబాబు, ఎ.సత్యనారాయణ, ఎ.ఎం రామమోహన్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు