కొత్త అభ్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (09:41 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అభ్యర్థుల పనితీరు ఏమాత్రం సంతృప్తిగా లేకున్నా.. ఆ అభ్యర్థులను మార్చివేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కొత్త అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమై దిశానిర్దేశం చేశారు. టిక్కెట్లు దక్కాయనే అలసత్వం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని సూచించారు. పనీతీరు బాగాలేదని తేలితో అభ్యర్థులను మార్చుతానని, ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయబోనని స్పష్టం చేశారు. అదేసమయంలో సీట్లు దక్కించుకున్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక్క పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని అభ్యర్థులను చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీల్లేదన్నారు. ఎవరైనా అసంతృప్తులు ఉంటే అభ్యర్థులే స్వయంగా ఒకటి పదిసార్లు వారిని కలవాలని, అభ్యర్థిననే అహంకారంతో ఉండొద్దని హితవు పలికారు. పోటీ చేసేది ఎంత సీనియర్ నేత అయినప్పటికీ, నియోజకవర్గంలో సానుకూల అంశాల ఉన్నా చివరి నిమిషం వరకు కష్టపడాలని చంద్రబాబు సూచించారు. తటస్థులనూ కలవాలన్నారు. టీడీపీ - జనసేన పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే నూటికి నూరు శాతం ఓట్లు బదిలీ అవుతాయని చెప్పారు. అందువల్ల జనసేన పార్టీ నేతలకు గౌరవం ఇస్తూ వారిని కూడా కలుపుకుని ఎన్నికల్లో పని చేయాలని పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తారని, వాటన్నింటికీ సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రమాళికను రూపొందించుకోవాలని వివరించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.3 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించామని, సర్వేలు పరిశీలించి, సుధీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థుల్ని ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు