ఏపీలో హోంగార్డులకు ఇళ్ల స్థలాలు

శనివారం, 14 మార్చి 2020 (13:33 IST)
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఉగాదినాటికి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో ఎన్నో సేవలు అందిస్తున్న హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. అందుకోసం ఇటీవల జీఓ 77ను విడుదల చేసింది. దీని ప్రకారం హోంగార్డుల సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు అర్హులుగా పేర్కొంది.

ఇప్పటికే ఈ జీఓ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది. ఇంకా మండలాల వారీగా ఆయా తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. చాలా మండలాల్లో తహసీల్దార్లు దీనిపై దృష్టి సారించకపోవటంపై ఆయా మండలాల పరిధిలోగల హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వం తమ కష్టాన్ని గుర్తించి న్యాయం చేసేందుకు ముందుకు వస్తుంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల వచ్చిన అవకాశాలు చేతికి అందకుండా పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. కొన్ని చోట్ల అసలు ప్రారంభం కాలేదు.

ఇదిలా ఉండగా  హోంగార్డులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అందరితో పాటు పట్టాలు అందజేయనున్నారు. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన స్కీం ద్వారా గృహ నిర్మాణానికి రూ.1.50లక్షలు అందజేయనున్నారు.

వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా పలు సందర్భాల్లో హోంగార్డుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమస్యలను విన్నవించుకున్నారు.

దీనికి స్పందించిన ముఖ్యమంత్రి హోంగార్డులకు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ, ఆ తరువాత ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జీఓ నంబర్‌.77ను విడుదల చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు