రమామణి మృతి పట్ల ఐఎఎస్ అధికారుల సంఘం సంతాపం

గురువారం, 28 మే 2020 (20:52 IST)
సీనియర్ ఐఎఎస్ అధికారి టికె రమామణి (56) ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ ఆదర్శభావాలు కలిగిన ఒక ఐఎఎస్ అధికారిణిని కోల్పోవటం బాధాకరమని, విభిన్న శాఖలలో తనదైన శైలిలో ఆమె ప్రజలకు సేవలు అందించారన్నారు.
 
రమామణి భర్త మురళీ మోహన్ ఎపి స్టెప్‌లో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇరువురు కుమారులు  ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్ర సర్వీసుల నుండి పదోన్నతిపై 2010లో ఐఎఎస్‌కు ఎంపికైన టికె రమామణి తొలుత అనంతపురం సంయిక్త కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 1964 అక్టోబరు 18న జన్మించిన రమామణి ఇటీవలి వరకు వాణిజ్య పన్నుల విభాగంలో కమీషనర్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు.
 
గుంటూరు పండరిపురంలో బంధువుల ఇంటికి గత రాత్రి వచ్చిన ఆమె, స్వల్ప అనారోగ్యంతో గురువారం గుంటూరు సర్వజన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రమామణి మృతి చెందారు. ఈ నేపధ్యంలో ప్రవీణ్ కుమార్, సునీత, ప్రవీణ్ ప్రకాష్‌తో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్లు ప్రశాంతి, దినేష్ కుమార్, మరియి ప్రద్యుమ్న, పియూష్ కుమార్, విజయ తదితరులు రమామణి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
 
రమా మణి భర్త మురళీమోహన్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. రామామణి తండ్రి టికెఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. శాసనసభ్యులుగా వ్యవహరించారని ఈ సందర్భంగా ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రస్తుతించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు