ఆ నేత గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరేందుకు సిద్ధమవుతున్నారా?

శుక్రవారం, 31 జులై 2020 (21:37 IST)
గాజు గ్లాస్‌ను కింద పడేసి ఫ్యాన్ గాలి కింద సేద తీరడం అంటే ఇప్పటికే అర్థమై పోయుంటుంది. గాజు అంటే జనసేన, ఫ్యాన్ అంటే వైసిపి. ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ వైసిపిలో చేరుతారు అంటూ మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటివి చెలరేగడం వాటిని నాదెండ్ల ఖండించడం తెలిసిందే. ఐతే ఇప్పుడు మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
 
నాదెండ్ల తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వైసిపిలో వెళ్ళాలని ఒత్తిడి తెస్తున్నారట. స్పీకర్‌గా పనిచేసిన అనుభవం నాదెండ్ల మనోహర్ ది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్‌కు ఎంతో గుర్తింపు ఉండేది. ప్రస్తుతం వైసిపిలో ఉన్న ముఖ్య నేతలందరూ నాదెండ్ల మనోహర్‌కు అత్యంత సన్నిహితులే. మనోహర్ జనసేనలో ఉండటం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే మనోహర్‌ను వచ్చేయమని కోరుతున్నారట.
 
ఆగస్టు 7వ తేదీన గంటా శ్రీనివాస్ వైసిపిలో చేరుతున్నారనీ, అటు తరువాత నాదెండ్ల కూడా తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్‌కు మాత్రం తెలియదట. మరి ఈ వార్త కూడా ఎప్పటిలాగే గాలి వార్తో లేదంటే నిజమో తెలియాలంటే నాదెండ్ల మనోహర్ స్వయంగా చెప్పాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు