తనకు ఇవ్వాల్సిన ఆస్తిని అప్పుగా ఇచ్చాడు.. మా జగన్ అన్న : వైఎస్ షర్మిల

వరుణ్

సోమవారం, 22 ఏప్రియల్ 2024 (08:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకెళుతున్నారు. ముఖ్యంగా తన అన్న, ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె అస్త్రాలు సంధిస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక వైకాపా నేతలు నోరెళ్లబెడుతున్నారు. తాజాగా కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల... దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. ఇందులో పేర్కొన్న అంశాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. షర్మిల తన అన్న వైఎస్. జగన్ నుంచి రూ.82 కోట్లు, వదిన భారతీరెడ్డి నుంచి రూ.19 లక్షలు అప్పు తీసుకున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో, అది కూడా అన్న నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం షర్మిలకు ఏమొచ్చింది అంటూ దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
 
ఈ అప్పులోని మర్మమేంటో ఆమె ఆదివారం బహిర్గతం చేశారు. 'నేను అఫిడవిట్‌లో పేర్కొన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు నాకు అప్పు ఇచ్చారు అనే విషయం మీడియాలో వస్తోంది. సమాజంలో ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆ ఆడబిడ్డ హక్కు. ఆస్తిని ఇచ్చేయాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. మేనమామగా కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తల్లి తర్వాత తల్లిలా మేనమామ ఉండాలి. సహజంగా ఇది అందరూ పాటించే నియమమే. కానీ కొందరు మాత్రం చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి, తామేదో ఆ ఆస్తిని చెల్లెలికి గిఫ్టుగా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారు. ఇంకొందరైతే చెల్లెలి వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, దాంట్లో ఒక కొసరు చెల్లెలికి ఇచ్చి, అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించేవారు ఉన్నారు. ఇది వాస్తవం... ఇది దేవుడికి తెలుసు... ఇది మా కుటుంబం అంతటికీ తెలుసు' అని షర్మిల వివరించారు. దీంతో చెల్లికి ఇవ్వాల్సిన వాటాను అన్న జగన్ అప్పుగా ఇచ్చారన్న చర్చ సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు