దేవుడికి కృతజ్ఞతలు, ఎందుకంటే? : సీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:26 IST)
‘గత 20 నెలలుగా మీ అందరితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక నానుడి ఉంది. క్రికెట్‌లో కెప్టెన్‌ ఒక్కడి వల్లనే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్‌ కలిసి సమష్టిగా కృషి చేస్తేనే ఏదైనా విజయం సాధ్యం అని.. మీ వంటి టీమ్‌ ఇక్కడ ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. అందరూ సమష్టిగా కృషి చేసినందువల్లనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాము. దిశ చట్టం మొదలు.. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో ఆ చట్టం ఒక విప్లవాత్మక పరిణామమని చెప్పవచ్చు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఇంకా ఎన్నో ఉన్నాయి’.
 
అవి అందరి దృష్టిని ఆకర్షించాయి:
‘ఇంకా వివరంగా చెప్పాలంటే.. విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణ. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈ రంగంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అవి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా, మిగిలిన రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ ప్రక్రియతోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పులు ఆగిపోలేదు’.
 
నిబద్ధతకు ప్రతిరూపం:
‘కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం చేపట్టిన టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ, ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ విధానం. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పరిపాలనలో నిబద్ధతకు ఇది ప్రతిరూపంలా నిల్చింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో విద్యాబోధన, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం, గత వందేళ్లలో ఏనాడు జరగని భూముల సమగ్ర రీసర్వే’.
 
అవినీతిరహితం-డీబీటీ:
‘వీటన్నింటికి మించి వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానం. ఎక్కడా దళారీలకు, అవినీతికి తావు లేకుండా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ. ఆ విధంగా దాదాపు రూ.90 వేల కోట్లు ఇవ్వడం జరిగింది. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేయడం జరిగింది’.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా:
‘విద్య వైద్య రంగాలలో నాడు–నేడుతో సమూల మార్పులు. ఇంకా పెద్ద సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ. 30.92 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ. రాష్ట్ర చరిత్రలో.. బహుషా దేశ చరిత్రలో కూడా ఏనాడూ ఒక 5 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగి ఉండకపోవచ్చు. కేవలం ఇళ్ల స్థలాలు మాత్రమే పంపిణీ చేయడమే కాదు, హౌజింగ్‌ రంగంలోనే ఒక కొత్త నిర్వచనానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకాన్ని బహుషా మన రాష్ట్రం మాత్రమే సమర్థవంతంగా వినియోగించుకుంటుందని చెప్పవచ్చనుకుంటా. ఎందుకంటే ఆ స్థాయిలో ఇళ్ల స్థలాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. ఆ విధంగా ప్రతి ఒక్క చర్య గతంలో ఏనాడూ లేని విధంగా ఉన్నాయి. అన్నీ ఒక విప్లవాత్మక నిర్ణయాలు, కార్యాచరణ’.
 
‘నిజం చెప్పాలంటే అలాంటి ఆలోచనలు చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన ప్రభుత్వ అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో ఆలోచించి, కచ్చితంగా ఏదైనా చేయాలని గట్టిగా సంకల్పించి, ఆ పని చేసి చూపించింది’.
 
రిలాక్స్‌ కావొద్దు:
‘పరిపాలనలో 20 నెలలు అంటే, దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయింది. అంటే మిడిల్‌ ఓవర్లలోకి వచ్చామన్న మాట. కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ అదే జరిగితే మనం వెనకబడిపోక తప్పదు. అందువల్ల ఇప్పుడు మనమంతా దృష్టిని తిరిగి కేంద్రీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఏమేం చేశాం? అంతా సవ్యంగా జరిగిందా? ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? అన్ని శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉందా? ఏమైనా లోపాలున్నాయా? ఉంటే ఎలా సవరించుకోవాలి? వంటి విషయాలపై వెంటనే దృష్టి పెట్టాల్సి ఉంది. ఆ మేరకు అన్నింటినీ మరోసారి ట్యూన్‌ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్‌ ఓవర్లలో ఉన్నాం. సహజంగా ఈ సమయంలో అందరూ బ్రేక్‌ తీసుకోవాలనుకుంటారు. కానీ అది జరగకూడదు. అప్పుడు మరింత ముందుకు వెళ్లగలుగుతాము’.
 
సీఎస్‌‌ను అభినందిస్తున్నా:
‘ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నాను. నిజానికి ఇలాంటి సమావేశాలు తరుచూ జరగాల్సి ఉంది. ఎందుకంటే వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. అంతే కాకుండా పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే వాటి పరిష్కారానికి ఆదేశాలు చేయగలుగుతాను. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఒక వైపు కాగా, మరొక వైపు ఇలాంటి సమావేశాలు మన ముందున్న పనులు, లక్ష్యాలపై మరోసారి దృష్టి పెట్టే వీలు కలుగుతుంది. అందువల్ల ఎక్కడైనా సమాచార లోపం ఉంటే, వెంటనే దాన్ని అధిగమించవచ్చు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవచ్చు. తద్వారా ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించుకోవచ్చు’.
 
నిస్సంకోచంగా చెప్పండి:
‘ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎందరో అధికారులు ఉన్నారు. సుపరిపాలన అందించడంలో వారందరికీ ఎంతో అనుభవం ఉంది. అందువల్ల మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా సరే, ఫలానా శాఖలో ఫలానా మార్పు చేస్తే ఇంకా సుపరిపాలన అందుతుంది అని మీరు భావిస్తే, ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు రండి. స్పష్టంగా మీ అభిప్రాయం తెలియజేయండి. నిస్సందేహంగా మీ సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను ఒక స్పష్టమైన స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి మీమీ ఆలోచనలను మీ వరకు పరిమితం చేసుకోకుండా, నిస్సంకోచంగా ముందుకు రండి. సుపరిపాలన కోసం మీమీ అభిప్రాయాలు తెలియజేయండి. సూచనలు ఇవ్వండి. వాటి అమలులో ప్రభుత్వం కూడా సంకోచించదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సుపరిపాలననే కోరుకుంటున్నారు. ఇవీ ముఖ్యమైన అంశాలు’.
 
నవరత్నాలు-మేనిఫెస్టో:
‘ఇక నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి చెప్పాలంటే.. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్ట దాఖలు చేసిన ఎందరో నాయకులను నేను చూశాను. ఎందుకంటే వందల హామీలతో వందల పేజీలతో వాటిని రూపొందించే వారు. కాబట్టి ఎన్నికల తర్వాత దాన్ని పట్టించుకునే వారే కాదు. కనీసం చూసే వారు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో మేము సరికొత్త మేనిఫెస్టోను తీసుకువచ్చాము. అది చదవడానికి చాలా సులభంగా ఉండడమే కాకుండా, ప్రతి రోజూ కళ్ల ముందు కనిపించేలా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసేలా (ఏయే హామీలు ఇచ్చాం? ఎన్నింటిని అమలు చేశాం? అన్న కోణంలో).. కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని ప్రతి శాఖ కార్యదర్శికి, ప్రతి విభాగాధిపతికి, ప్రతి కలెక్టర్‌కు అందజేశాం. అందులో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పని చేశాం. కార్యక్రమాలు నిర్వహించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం వరకు అమలు చేశాం. చేస్తున్నాం’.
 
ప్రజలూ గర్విస్తున్నారు:
‘ఇప్పటికే 20 నెలలు గడిచినందువల్ల ఇంకా మంచి చేసేందుకు మీ అందరి నుంచి పూర్తి సహాయ, సహకారాలు కావాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క అధికారి నా అంచనాలకు మించి అంకిత భావంతో పని చేశారు. చేస్తున్నారు. మీ వంటి అధికారులు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలంతా గర్విస్తున్నారు. గొప్పగా భావిస్తున్నారు’.
 
ఒక్కొక్కటీ చక్కదిద్దుకుంటూ..:
‘నేను అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ చెప్పారు, దాదాపు రూ.60 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని, వాటిలో రూ.21 వేల కోట్లు కేవలం విద్యుత్‌ బిల్లుల బకాయిలు కాగా, మిగిలిన రూ.39 వేల కోట్ల బిల్లులు వివిధ శాఖలకు సంబంధించినవి. అప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల బకాయిలు. తారాస్థాయికి చేరిన అవినీతి. జన్మభూమి కమిటీల యథేచ్ఛ అవినీతి పర్వం. ప్రతి పనికి లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి. గ్రామస్థాయిలోనూ అంతులేని అవినీతి వ్యవహారాలు. అంతే కాకుండా కేంద్రంతో పాటు, పొరుగు రాష్ట్రాలతో కూడా ఏ మాత్రం సయోధ్య లేని పరిస్థితి. మేము అధికారం చేపట్టినప్పుడు ఉన్న దుస్థితి అది. ఆ పరిస్థితి నుంచి అన్నీ చక్కదిద్దుకుంటూ ఇంత దూరం వచ్చామని గర్వంగా చెప్పగలుగుతాను’.
 
సహాయ సహకారాలు మరువలేను:
‘ఇప్పటి వరకు మీరు అందించిన సహాయ, సహకారాలను ఇక ముందు కూడా కొనసాగిస్తారని మనసారా ఆశిస్తున్నాను. మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’.
 
గడప వద్దకే పాలన:
‘పరిపాలనలో గతంలో కంటే ఎంతో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మండల స్థాయిలో పరిపాలన అందేది. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, ఇప్పుడు గ్రామ స్థాయిలోనే పాలన అందిస్తున్నాం. ఆ విధంగా పరిపాలన రూపాంతరం చెందింది. మండల స్థాయిలో పరిపాలన వల్ల అవినీతి జరిగేది. ప్రతిదీ మండల స్థాయిలో జరగడం వల్ల, అన్నీ ఆలస్యమయ్యేవి. అంతే కాకుండా ప్రతి చోటా అవినీతి కొనసాగేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిపాలన అందుతోంది. ఒక్కో గ్రామంలో దాదాపు 700 ఇళ్లు ఉన్నాయనుకుంటే, దాదాపు 10 మంది అధికారులు పని చేస్తున్నారు. ఆ విధంగా ఒక పరిధిలోనే సేవలందించడం వల్ల, ఏ అధికారి కూడా లంచం ఆశించే వీలు కలగడం లేదు. నిజం చెప్పాలంటే లంచం కోరాలన్నా అధికారులకు కష్టమే’.
 
‘ఓన్‌’ చేసుకోవాలి:
‘ఆ విధంగా గ్రామ స్థాయికి పరిపాలనను తీసుకువెళ్తూ, మనం ఏర్పాటు చేసుకున్న సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్‌’ (మాది అని గొప్పగా చెప్పుకోవడం) చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క కార్యదర్శి, ప్రతి విభాగాధిపతి, ఆ విధంగా ఆ వ్యవస్థను ఓన్‌ చేసుకోకపోతే, వివిధ శాఖల మధ్య పూర్తి సమన్వయం కుదరదు. అలాంటప్పుడు సక్రమమైన సేవలందవు. ఎందుకంటే గ్రామాల్లో వచ్చే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలి. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలి. అవి జరగకపోతే ప్రజలకు ప్రభుత్వంపైనా, కార్యదర్శులపైనా నమ్మకం, విశ్వాసం పోతుంది. అందువల్ల గ్రామాల నుంచి వస్తున్న వినతులపై అధికార యంత్రాంగం నుంచి పూర్తి స్పందన ఉండాలి. అవి ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడే కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు కూడా మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆ విధమైన పరిపాలన, చొరవ కార్యదర్శులు, విభాగాధిపతులకు ఎంతో ముఖ్యం’.
 
వాలంటీర్ల వ్యవస్థ:
‘ఇదే కాకుండా వాలంటీర్ల వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించాం. వారిలో కొందరు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. నిజానికి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల నియామకం, ఆయా వ్యవస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమే కదా?. గతంలో మనందరికీ తెలుసు. ప్రజల కోసం పంపిస్తున్న ప్రతి రూపాయిలో చివరకు లబ్ధిదారులకు 40 పైసల కంటే తక్కువే అందుతోందని. అదే విధంగా అర్హులైన లబ్ధిదారుల సంఖ్యను కూడా ఎక్కువ చేసి చూపే వారు. అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందాలని, అనర్హులైన వారిలో ఏ ఒక్కరికి కూడా సహాయం అందవద్దన్న సంకల్పంతోనే వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం’.
 
వాలంటీర్లకు సత్కారం:
‘వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి, ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం, మొత్తం వ్యవస్థనే నీరు గారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వాలంటీర్లను ప్రోత్సహించాల్సి (మోటివేట్‌) ఉంది. ఆ ప్రక్రియలో నాకు ఇవాళే ఒక ఆలోచన వచ్చింది’. ‘ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వాలంటీర్ల సత్కారం. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు. అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుంది. వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి ఉగాది రోజున ఈ కార్యక్రమం మొదలు పెట్టి, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో రోజున వాలంటీర్లను సత్కరించాలి’.
 
‘ఉదాహరణకు మా సొంత జిల్లా కడపలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అది 10 రోజుల కార్యక్రమం. అలా తూర్పు గోదావరి జిల్లాలో అయితే 19 రోజులు, గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు వాలంటీర్ల సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. వాటిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, గ్రామ సచివాలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాయింట్‌ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వాలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలి. ఆ విధంగా చేయడం వల్ల, వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇవ్వడం వల్ల వారిని ఎంతో ప్రోత్సహించినట్లు అవుతుంది. అప్పుడు వారు తమ బాధ్యతలను కేవలం ఒక ఉద్యోగంగా భావించకుండా, సేవా దృక్పథంతో పని చేస్తారు’.
 
ఇది ఒక మోటివేషన్‌:
‘ఏటా ప్రతి ఉగాది పర్వదినం రోజున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే, వాలంటీర్లను ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది. ఇంకా వాలంటీర్లు మహోన్నతమైన సేవలందిస్తున్నారన్న భావన కూడా అందరిలో కలిగించినట్లు అవుతుంది’.
 
కార్యాచరణ సిద్ధం చేయండి:
‘కాబట్టి వచ్చే ఉగాది నుంచి ఆ కార్యక్రమం మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేయండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల మధ్య పూర్తి సమన్వయం ఉంటే ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా, సమర్థంగా ప్రజలకు అందుతాయి. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు మొత్తం ఈ వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోకపోతే, అది సాధ్యం కాదు. అందువల్ల మీలో ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను తమదిగా భావించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల నుంచి వచ్చే వినతులు, సంబంధిత విభాగాలకు వెళ్లేలా చూడడం, వాటి సత్వం పరిష్కారంపై దృష్టి పెట్టడం జరగాలి’.
 
చివరగా..
‘అందుకే కార్యదర్శులు, విభాగాధిపతులు ఎప్పటికప్పుడు ఆయా వినతులు ఏ స్టేజ్‌లో ఉన్నాయి? అవి సత్వరం పరిష్కారమవుతున్నాయా? లేదా? లేక ఆలస్యం అవుతున్నాయా? అన్న దాన్ని నిరంతరం సమీక్షించుకోవాలి’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు