ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతున్న కేసీఆర్ ప్ర‌భుత్వం

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:18 IST)
ప్ర‌జాస్వామ్యంలో దేవాల‌యం వంటి శాస‌న‌స‌భ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎల్పీ ఎమ్మెల్యేల‌తో ఆయ‌న గ‌న్ పార్క్ వ‌ద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సీఎల్పీ నేత‌తో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, సీత‌క్క‌, తూర్పు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా బ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌ను, ప‌లు స‌మ‌స్య‌ల‌ను, స‌భ‌లో చ‌ర్చించేలాని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ దృష్టికి తీసుకురావ‌డంలో ప్ర‌తిప‌క్షం పాత్ర కీల‌క‌మైంద‌ని అన్నారు. అటువంటి ప్ర‌తిప‌క్షం గొంతు నొక్కి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.

అస‌లు ప్ర‌తిప‌క్షం ఉనికే స‌భ‌లో లేకుండా చేసేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. ఇటువంటి చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్యానికే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. సభ‌లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌ని అన్నారు. ఎంఐఎం స‌భ్యులు ప్ర‌భుత్వానికి స‌భ‌లో మిత్ర‌ప‌క్షంగానే ఉన్నార‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి స‌భ‌లో మాట్లాడేందుకు కేవలం 6 నిమిషాలు ఇవ్వ‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. కాంగ్రెస్ సంఖ్యాబ‌లాన్ని బ‌ట్టి మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్న అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు 19 మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చి ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌మ‌ని ప్ర‌జ‌లు చెప్పార‌ని.. అన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ కొని.. సంఖ్యాబ‌లం లేద‌ని చెప్ప‌డం విడ్డూర‌మ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి రోజులో 6 నిమిషాలు కేటాయించి మాట్లాడ‌మంటే.. ఏమి మాట్లాడాల‌ని ఆమ‌న ప్ర‌శ్నించారు. ఆ 6 నిమిషాల్లోనే 2వ నిమిషంనుంచే గంట కొడుతుంటే.. ఏమి చేయాల‌ని అన్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌భ‌లో ఏవిధంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతామ‌ని అన్నారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియా పాయింట్ ఎత్తేయ‌డంపైనా భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు