కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు: జగన్

సోమవారం, 13 జులై 2020 (19:14 IST)
‌ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సకాలానికే అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. 
 
కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, జీఏడీ సర్వీసెస్‌ సెక్రటరీ శశిభూషణ్, కార్మిక శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ మల్లికార్జున్‌ తదితరులు హాజరయ్యారు.
 
వివిధ ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు, వారి జీతాలు, స్థితిగతులపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పని చేస్తున్న సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్‌పై హడావిడిగా జీవో జారీ చేసిందని, అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రిగా వైయస్‌.జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019, జూలై నుంచి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తున్నట్లు సమావేశం పేర్కొంది.

దీని ఫలితంగా..జూనియర్‌ లెక్చరర్‌కు రూ.19,050 ఉన్న జీతం 2019 జులై నాటికి 95 శాతం పెరిగి రూ.37,100 అయ్యింది. మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) జీతం రూ.14,860 నుంచి 88 శాతం పెరిగి రూ.22,290 అయ్యింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) జీతం రూ.10,900 నుంచి 95 శాతం పెరిగి  రూ.21,230 అయ్యింది. స్కూల్‌ అసిస్టెంట్‌ జీతం రూ. 10,900 నుంచి 95 శాతం పెరిగి జులై , 2019 నాటి నుంచి రూ. 21,230 అయ్యింది. 
 
 
దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. రెగ్యులర్‌ ఉద్యోగుల్లానే, సకాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లానే సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు