వైసీపీ పతనం ప్రారంభం: చంద్రబాబు

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:45 IST)
వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇది ఆరంభం మాత్రమేనని.. వైసీపీని ఎవరూ కాపాడలేరని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదన్నారు.

వైసీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఎవరూ కాపాడలేరని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వీరోచితంగా పోరాడారని, ప్రాంతాలు, కులాలకు అతీతంగా పోరాటం చేశారని కొనియాడారు.
 
పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకా 10శాతం ఫలితాలు టీడీపీకి పెరిగేవని, అదే జరిగితే వైసీపీ ఇప్పుడే పతనం అయ్యేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ధరలు పెంచినందుకు వైసీపీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు.

వైసీపీ అధికార దుర్వినియోగంపై ఆధారపడిందని, పోలీసులు ఉన్నంత వరకే వైసీపీ నేతల ప్రతాపమని ఆయన దుయబట్టారు. వైసీపీ నేతలు రెండేళ్లకే మిడిసిపడుతున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.

ఏకగ్రీవాలు చేసుకోవాలన్న వైసీపీ ఆటలు సాగలేదన్నారు. కొత్తవలస టీడీపీ అభ్యర్థికి 250 ఓట్ల మెజారిటీ వచ్చినా రీకౌంటింగ్‌ కోరతారా? టీడీపీ గెలిస్తే రీకౌంటింగ్‌.. వైసీపీ గెలిస్తే ఉండదా? అని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు