కరోనావైరస్: 'తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు' -కేసీఆర్

మంగళవారం, 5 మే 2020 (22:55 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 29 వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. అది మనల్ని వేటాడుతుంది. ఉపాయం ఉన్నవాడు అపాయం నుంచి తప్పించుకోవాలని, మనల్ని మనమే రక్షించుకోవాలన్నారు.

 
భారతదేశంలో మొదటి కంటెన్మెయింట్ జోన్ కరీంనగర్. దేశంలో ఎక్కడా కంటెన్మెయింట్ గురించి మాట్లాడకముందే తెలంగాణ ప్రభుత్వం ఆ పదాన్ని ఉపయోగించిందని కేసీఆర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లాలో ఇండొనేషియా వాళ్ళు వచ్చారని తెలిసినప్పుడు, ఆ జిల్లాను కంటెన్మెయింట్ ప్రాంతంగా ప్రకటించి, వైరస్ సోకిన వారికి వెంటనే చికిత్స అందించి మరణాలు సంభవించకుండా చూసుకున్నాం. ఆ విషయంలో సక్సెస్ అయ్యామని తెలంగాణ సీఎం చెప్పారు.

 
కరోనావైరస్ కేసులు మొదలైన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రత్తంగా వ్యవహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని, మరణాల రేటు దేశవ్యాప్తంగా 3.37 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 2.64 శాతంగా ఉందని ఆయన చెప్పారు.

 
కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే:
- తెలంగాణలో మొత్తం 1096 మందికి కరోనా సోకింది. కొత్తగా ఇవాళ 11 మందికి వచ్చింది. ఇప్పటి వరకూ 628 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం యాక్టివ్ కేసులు 439.

 
- కరీంనగర్ దేశానికే ఆదర్శం అయింది. ఉదాహరణగా నిలిచింది. దేశానికి కంటైన్మెంట్ అనే పదం తెలియనప్పుడే కరీంనగర్ కంటైన్మెంట్ జోన్ గా ఉంది. కానీ పకడ్బందీ ఏర్పాట్లతో దాన్ని జయించారు. ఇప్పుడు కరీంనగర్ జీతో అయింది. కరీంనగర్ లో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకున్నాం. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగతా ప్రాంతాల్లో అమలు చేశాం. కరీంనగర్ వెళ్లకుండా నేను కూడా అందుకే ఆగాను.

 
- తెలంగాణ కర్వ్ ఫ్లాటెనింగ్ స్టేజిలో ఉంది. దీన్ని పూర్తిగా క్రష్ చేసి సున్నాకు తేవాలి.

 
- ఆ ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతోంది. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటిక్ కంపెనీ వారు సిఎంఆర్ఎఫ్ విరాళం ఇవ్వడానికి వచ్చి కాసేపు మాట్లాడారు. వారితో పాటూ బయోలాజికల్-ఇ నుంచి మహిమా దాట్ల, శాంతా బయోటిక్ వరప్రసాద్ రెడ్డి గారు నాతో మాట్లాడారు. ఆగస్టు లేదా సెప్టెంబరుకు వ్యాక్సీన్ వస్తుందని వరప్రసాద రెడ్డి గట్టిగా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు నాటికే తెలంగాణ నుంచి వాక్సిన్ వస్తే మనం ప్రపంచానికి మేలు చేసిన వారమవుతాం.

 
ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ అంటే సాంఘిక బహిష్కరణ లాగా ఉంది. బాలేదు, ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం అని రాద్దాం.

 
- తెలంగాణ కరోనా నుంచి తక్కువ నష్టాలతో బయట పడింది. అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఇతర వ్యాధులు ఉన్నవారు, షుగర్, కిడ్నీ, బీపీ, కాన్సర్, గుండె జబ్బులు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు నెలలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో వారు పదే పదే బయటకు రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారు 40-50 లక్షల మంది ఉంటారు. వారి కోసం ఆరోగ్య శాఖ 1 కోటి మాస్కులు అందిస్తాం. దానికోసం ప్రణాళిక తయారు చేశారు.

 
- కేంద్ర దేశాన్ని జోన్లుగా విభజించారు. సూర్యాపేట, వరంగల్ అర్బన్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. 9 జిల్లాలు, యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, కొత్తగూడెం, సిద్ధిపేట, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 18 జిల్లాలు ఆరెంజ్ .. సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్లగొండ, నిజమాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, ఆసిఫాబాద్, నిర్మల్, గద్వాల ఆరెంజ్ జోన్లో ఉన్నాయి.

 
- మరో ఐదారు జిల్లాలు ఇవాళ నుంచి గ్రీన్ జోన్‌లోకి వస్తాయి. మిగిలిన 18 జిల్లాలు కూడా 11 రోజుల్లో గ్రీన్ జోనులోకి వస్తాయి. రాష్ట్రంలో 35, హైదరాబాద్‌లో 19 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వీటిలో ఈరోజుకే 12 మిగులుతాయి.

 
- రెడ్ జోన్లోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలో జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ కఠినంగా ఉండాలి. లేకపోతే పాపం మూటగట్టుకున్నవాళ్లం అయితాం. రాజీ పడలేం. మొత్తం కేసుల్లో 66 శాతం అంటే 726 కేసులు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 29 మరణాల్లో 86 శాతం 24 మంది ఇక్కడే మరణించారు.

 
- లాక్‌డౌన్ మే 29 వరకూ పొడిగిస్తున్నాం. కచ్చితంగా దాన్ని సీరియస్ గా అమలు చేస్తాం. రాత్రి 7 తరువాత కర్ఫ్యూ రాష్ట్రమంతా ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకూ అందరూ కొనుగోళ్లు ముగించుకుని పావుతక్కువ ఏడుకే ఇళ్లకు చేరుకోవాలి. లేకపోతే పోలీసు చర్యలుంటాయి. ఇంత వరకూ విజయం సాధించాం. ఇప్పుడు అతిక్రమిస్తే దెబ్బతినిపోతాం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచి అదుపులో ఉంది. ప్రజలు సహకరించాలి. కొంచెం ఓపికపట్టాలి.

 
- తెలంగాణే కాదు, మన దేశానికే ఇలాంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు. మనం డిపెండెంట్ కంట్రీ. మన దగ్గర అన్నీ దిగుమతి చేసుకోవాల్సిందే. పీపీఈ కిట్లు 10 లక్షలు ఆర్డర్ చేశాం. ఎన్ 95 మాస్కులు 6 లక్షల వరకూ ఉన్నాయి. కిట్లు అవసరమైతే పక్క రాష్ట్రాలకూ సాయం చేసే పరిస్థితుల్లో ఉన్నాం.

 
- ఇతరత్రా జబ్బులు ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో రిస్కు తీసుకోవద్దు. 60 ఏళ్లు దాటిన వారు, చిన్న పిల్లలూ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకుండా చూసుకోవాలి.

 
- కేంద్రం మార్గదర్శకాలన్నీ తూ.చ తప్పకుండా యధాతథంగా అమలు చేస్తాం. ఇంకా కఠినంగా చేస్తాం. కేంద్రం రెడ్ జోన్లో షాపులు తెరవచ్చు అంది. తెలంగాణలో తెలవడం లేదు. రెడ్ జోన్లో సింగిల్ షాపు కూడా ఓపెన్ చేయబోము. రెడ్ జోన్లలో కేవలం ఇంటి నిర్మాణం కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించినవి మాత్రమే ఓపెన్ చేస్తారు. నిత్యావసరాలు యథాతథంగా కొనసాగుతాయి. సిమెంట్, స్టీల్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్ షాపులు అనుమతిస్తారు. ఇంకే షాపులు తీయరు. వ్యవసాయ పనిముట్లు, స్పేర్ పనిముట్లు, ట్రాక్టర్ స్సేర్ పార్టులూ, ఎరువులు, పురుగుమందుల షాపులకు అనుమతి ఉంటుంది. 15 వరకూ పరిస్థితి చూసి తరువాత రెడ్ జోన్లో షాపుల సంగతి ఆలోచిస్తాం.

 
- ఆరు రెడ్ జోన్లు తప్ప మిగతా చోట్ల షాపులకు అనుమతి. గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రం, ఇతర గ్రామాల్లో అన్ని షాపులూ తెరచుకోవచ్చు. మునిసిపాలిటీల్లో మాత్రం అన్ని షాపులూ కాదు. లాటరీ పద్ధతిలో 50 శాతం షాపులకు అనుమతి.

 
- జోన్లతో సంబంధం లేకుండా రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ప్రైవేటు ఆఫీసులు 1/3తో తెరవవచ్చు, ప్రభుత్వ ఆఫీసులు పనిచేస్తాయి.

 
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆర్టీయే కార్యకలాపాలు కొనసాగుతాయి.

 
- బుధవారం 6వ తేదీ నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుంది.

 
వలస కార్మికుల గురించి...
- రాష్ట్రంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. ఒకేసారి లక్షల మందిని పంపలేము. ఇవాళ ఉత్తర ప్రదేశ్ సీఎంతో మాట్లాడాను. మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్లాలో అక్కడ ప్రజా రవాణా కూడా లేదు. ఉదాహరణకు, బిహార్ వంటి రాష్ట్రంలోకి ఎక్కువ మంది వస్తున్నారు. వారిని తీసుకోవడం వాళ్లకూ ఇబ్బందే. మీరు వెళ్లాలనుకుంటే పంపుతాం. కానీ, లక్షల్లో పంపలేం. మీరు ఉండటానికి ప్రయత్నించండి.

 
- మేం 12 రైళ్లు పెట్టాం. బిహార్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు పంపాం. మేం 40 రైళ్లను పంపాలనుకున్నాం. కానీ ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేనందున కొన్ని రైళ్లే పంపాం. మన రైస్ మిల్లుల్లో బిహార్ వారు పనిచేస్తున్నారు. వారు తిరిగి బిహార్ నుంచి రావాలనుకుటున్నారు. వారిని మొన్న వెళ్లే రైళ్లలోనే వెనక్కు వస్తున్నారు.

 
తెలంగాణ మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొంటోంది
- ఇది రైతు రాజ్యం. భారత చరిత్రలో ఇప్పటి వరకూ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం లేదు. వాళ్ల ఊళ్లకే వెళ్లి, మద్దతు ధర ఇచ్చి కొన్న సందర్భం కూడా లేదు.

 
- భారతదేశంలో ఎన్నో పార్టీలు పాలించిన రాష్ట్రాలున్నాయి. కానీ ఏ రాష్ట్రంలోనూ పంట కొనడం లేదు. కేవలం తెలంగాణ మాత్రమే కొంటున్నది. కాబట్టి రైతులు సంయమనం పాటించాలి. తలకుమాసిన వారు వచ్చి ఏదో చెబుతారు. వారి మాట వింటే మీరే నష్టపోతారు. ప్రభుత్వం వదిలేస్తే ఏం చేస్తారు? గజ్వేల్ లో మేం చెప్పిన ధర కంటే ఎక్కువ చెప్పిన రైతు నుంచి మక్కలు (మొక్కజొన్న) కొనలేదు. వెళ్లిపోమన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తుంది. అన్ని రకాలు దినుసులు కొంటున్నాం.

 
- భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఇన్ని పంటలు కొనలేదు.

 
- రైతుల 25 వేల రూపాయల లోపు రుణాల మాఫీ కోసం 1,198 కోట్లు విడుదల చేస్తున్నాం.

 
- రైతుబంధు పథకం కచ్చితంగా కొనసాగుతుంది.

 
- రైతులు, పేదల సంక్షమంలో రాజీ పడే ప్రసక్తే లేదు.

 
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు