రైలు ప్రయాణికుల నెత్తిన యూజర్ చార్జీల మోత... అక్టోబరు నుంచి వసూలు!!

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:45 IST)
రైలు ప్రయాణం ఇకపై మరింత భారంకానుంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే వందలాది రూపాయలు ప్రయాణ చార్జీగా చెల్లించాల్సిన పరిస్థితి వుంది. అందుకే ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణం కోరుకుంటారు. పైగా, రైళ్ళలో ఇప్పటివరకు చార్జీలు తక్కువగా ఉన్నాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా గత ఆర్నెల్లుగా రైలు సేవలు ఆగిపోయి వున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు వీలుగా వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులోభాగంగా, యూజర్ చార్జీలను తెరపైకి తెచ్చింది. 
 
వినియోగ రుసుం పేరుతో ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అయితే, ఇది అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులకు మాత్రమే పరిమితం కానుంది. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. 
 
అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులపై గరిష్టంగా రూ.35 వరకు పెంపు ఉండగా, కనిష్టంగా పది రూపాయల వరకు వినియోగ రుసుమును వసూలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వే శాఖ త్వరలో పంపనున్నట్టు తెలుస్తోంది.
 
దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు