కరోనా వైరస్ : కేసుల్లో నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్

శుక్రవారం, 12 జూన్ 2020 (09:03 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఐదు దశలుగా లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కొత్త కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసుల సంఖ్యలో బ్రిటన్‌, స్పెయిన్‌లను దాటేసి నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.86 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. 
 
గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 2.86 లక్షలు దాటింది. కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్‌ ఆరో స్థానంలో ఉంది. ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న బ్రిటన్ ‌(2.9 లక్షలు), స్పెయిన్ ‌(2.89 లక్షలు)లలో రోజువారీ కేసుల పెరుగుదల దాదాపుగా వెయ్యికి దిగువనే ఉంటోంది. 
 
ఈ లెక్కన శుక్రవారంతో ఆ రెండింటినీ మన దేశం దాటేసింది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో 9,996 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. మరణాల్లోనూ దేశంలో కొత్త రికార్డు నమోదైంది. 
 
గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో ఒక్కరోజులోనే 357 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య ఒక్కరోజులో 300 దాటడం ఇదే ప్రథమం. 24 గంటల్లో 5,823 మంది కోలుకోవడంతో మొత్తంగా రికవరీ రేటు 49.21 శాతానికి చేరుకుంది. ఢిల్లీలో 1,500కుపైగా కొత్త కేసులొచ్చాయి. 
 
మరోవైపు, దామన్ దీవ్‌లో కూడా తొలిసారి కరోనా కేసులు బయటపడ్డాయి. అక్కడ ఒక్కరోజే ఇద్దరు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాప్తి చెందని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఇక లక్షద్వీప్‌ ఒక్కటే మిగిలి ఉంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో క్రియాశీల(యాక్టివ్‌) కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు