భారత క్రికెట్ జట్టు మరో ప్రపంచ కప్ సాధించాలి.. : రోహిత్ శర్మ

వరుణ్

శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (16:11 IST)
భారత క్రికెట్ జట్టు మరో ప్రపంచ కప్ సాధించాలని, అలాగే 2025లో జరిగే టె్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విశ్వవిజేతగా నిలవాలన్నదే తన ఆకాంక్ష అని భారత కెప్టెన్, ముంబై ఇండియన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అన్నాడు. నిజానికి గత యేడాది జరిగిన ప్రపంచ కప్ పోటీలు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, వాటన్నింటినీ కొట్టిపడేస్తూ భారత జట్టుకు టీ20 పగ్గాలను కూడా అందుకొన్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లోనూ అతడి నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
36 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పట్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ‘బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌’ కార్యక్రమంలో రిటైర్‌మెంట్, భవిష్యత్తులో సాధించాల్సిన వాటి గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇప్పటికిప్పుడు నాకేమీ క్రికెట్‌ను వదిలేయాలనే ఆలోచన లేదు. అయితే, జీవితం ఎలా సాగుతుందనేది మనకు తెలియదు. ఇప్పటికీ అత్యుత్తమ ఆట తీరునే ప్రదర్శిస్తున్నా. మరికొన్నేళ్లు తప్పకుండా ఆటలో కొనసాగుతా. భారత్ తరఫున భారీ టోర్నీలు గెలవాలనేదే నా కోరిక. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. టీమ్‌ఇండియా మరో వరల్డ్‌కప్‌ సాధించాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2025లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా' అని రోహిత్ తెలిపాడు. 
 
'నా వరకు వన్డే ప్రపంచకప్‌ మాత్రమే అసలైన టోర్నీ. మేమంతా 50 ఓవర్ల క్రికెట్‌ను చూస్తూ పెరిగాం. మన దేశంలో మన అభిమానుల మధ్య గతేడాది జరిగింది. అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరుకున్నాం. సెమీస్‌ గెలిచిన తర్వాత ఒకే ఒక్క అడుగు మాత్రమే టైటిల్‌ను అందుకోవడానికి ఉందని భావించా. అయితే ఫైనల్‌లో మాకు పరాభవం ఎదురైంది. ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు నా మనసులోకి వచ్చాయి. అన్ని విభాగాల్లోనూ బాగానే ఆడాం కదా.. ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఎందుకు ఇలా జరిగిందని మదనపడ్డా. ఒకే ఒక్క చెడ్డ రోజు మాకు కప్‌ను దూరం చేసింది. అయితే, ఫైనల్‌లో మేం సరిగా ఆడలేదని మాత్రం భావించడం లేదు. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఆసీస్‌ మాకంటే కాస్త బెటర్‌గా ఆడింది కాబట్టే విజేతగా నిలిచింది' అని రోహిత్ వెల్లడించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు