ఇది... అయోధ్య నగరిలో ఆలయ నిర్మాణ చరిత్ర (video)

బుధవారం, 5 ఆగస్టు 2020 (13:01 IST)
శ్రీరాముడు జన్మించిన ప్రాంతంగా గుర్తింపుకెక్కిన అయోధ్య నగరంలో రామమందిరాన్ని నిర్మించాలన్న డిమాండ్ కొన్ని శతాబ్దాలుగా ఉంది. ముఖ్యంగా, 1528 నుంచి 1822 వరకు ఆలయం కోసం డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. రామాలయంపై మసీదు నిర్మించారని 1822లో ఫైజాబాద్‌ కోర్టు అధికారి ఒకరు పేర్కొనడం హిందువులకు ఆసరా అయింది. దీని ఆధారంగా.. మసీదున్న ప్రదేశం తమదేనని.. దానిని గుడికట్టేందుకు తమకివ్వాలని నిర్మోహి అఖాడా వాదన అందుకుంది. 
 
ఈ విషయమై 1855లో పెద్దఎత్తున హిందూ-ముస్లిం ఘర్షణలు జరిగాయి. మున్ముందు ఇలాంటివి జరగకుండా.. 1859లో మసీదు ఆవరణలో బ్రిటిష్‌ పాలకులు రెయిలింగ్‌ ఏర్పాటుచేశారు. 1949 వరకూ ఎలాంటి గొడవలు లేకుండా నడిచింది. 1949లో హిందూమహాసభ కార్యకర్తలు కొందరు మసీదు ప్రాంగణంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. వ్యవహారం కోర్టుకెక్కింది. దీనిని వివాదాస్పద కట్టడంగా ప్రకటించారు. 
 
మసీదు తలుపులకు తాళం వేశారు. అదేసమయంలో రామజన్మభూమి ఉద్యమం మొదలైంది. 1980లో విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) రంగప్రవేశం చేసింది. వివాదాస్పద ప్రదేశంలో రామాలయం నిర్మించాలని ఉద్యమం ప్రారంభించింది. 1986లో ఫైజాబాద్‌ జిల్లా జడ్జి.. ఆ కట్టడం తలుపులు తెరిచి హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతించారు. దీనిని కేంద్రంలో నాటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం సమర్థించింది. 
 
షాబానో కేసులో ఆయన ప్రభుత్వ తీరుతో హిందువులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. తిరిగి వారికి చేరువయ్యేందుకు జిల్లా కోర్టు నిర్ణయానికి రాజీవ్‌ మద్దతు పలికారు. అయితే రెండు వర్గాల ఓట్లు దూరమై 1989లో ఆయన అధికారం కోల్పోయారు. లోక్‌సభలో బీజేపీ బలం పుంజుకుంది. దాని సీట్లు 2 నుంచి 88కి పెరిగాయి. ఆ పార్టీ మద్దతుతో వీపీ సింగ్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది. 
 
తర్వాత కొద్దికాలానికి బీజేపీ పూర్తిస్థాయిలో రామజన్మభూమి ఉద్యమంలోకి దిగడమే కాకుండా.. దానిని సంపూర్ణ రాజకీయ ఉద్యమంగా మార్చేసింది. దీనిని ఎల్‌కే అద్వానీ మరింత ఉర్రూతలూగించారు. సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య వరకు రామ రథయాత్ర ప్రారంభించారు. హిందువుల ఓట్లను మరింత సంఘటితం చేయడమే ఈ యాత్ర ప్రధానోద్దేశం. 
 
1990 సెప్టెంబరు 25న సోమ్‌నాథ్‌లో ఆడ్వాణీ మొదలుపెట్టిన ఈ యాత్ర వందల గ్రామాలు, నగరాల గుండా సాగింది. దీనివల్ల ఉత్తర భారతంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. నాటి బిహార్‌ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌.. రథయాత్ర సమస్తిపూర్‌ చేరుకోగానే సరిహద్దులోనే అద్వానీని అక్టోబరు 23న అరెస్టు చేయించారు. దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పిన సంఘటన ఇదే. 
 
లక్షన్నర మంది కరసేవకులను యూపీలోని ములాయంసింగ్‌ యాదవ్‌ సర్కారు అరెస్టు చేసింది. అయినప్పటికీ వేల మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. పోలీసు కాల్పుల్లో 20 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన బీజేపీ.. వీపీ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధాని అయ్యారు. 
 
ఆ తర్వాత 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. బీజేపీ తన బలాన్ని 120 స్థానాలకు పెంచుకుంది. 1996 ఎన్నికలనాటికి బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీ (161 స్థానాలు)గా ఎదిగింది. వాజపేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ లౌకికవాద పార్టీలేవీ మద్దతివ్వకపోవడంతో 13 రోజులకే రాజీనామా చేశారు. 
 
1998 ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతుతో వాజపేయి సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఏడాది గడవకముందే ఒకే ఓటు తేడాతో ఓడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ వాజపేయి ప్రభుత్వం ఏర్పడింది. ఆలయానికి అనుకూలంగా చట్టం తేవాలని సంఘ్‌పరివార్‌ డిమాండ్‌ చేసినా.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు అందుకు సుముఖంగా లేకపోవడంతో వాజపేయి సాహసించలేదు. 
 
కొన్నాళ్లకు ఉత్తరభారతంలో ఓటర్లు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు. ఫలితంగా 2004-14 మధ్య పదేళ్లు ఆ పార్టీ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం నడిచింది. కానీ నిష్ర్కియాపరత్వం కారణంగా పరాజయం పాలైంది. 2014, 19ల్లో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రాముడికి అనుకూలంగా వచ్చిన సుప్రీం తీర్పుతో ఇప్పుడు రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు