సముద్రపు నాచుతో కరోనా వైరస్‌కు చెక్ : రిలయన్స్ రీసెర్స్ సెంటర్

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:37 IST)
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ మహమ్మారిని తుదముట్టించేందుకు సరైన మందు లేదు. దీంతో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య లక్ష దాటిపోయింది. అలాగే, లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. అయితే, ఇప్పటివరకు సరైన మందు లేకపోవడంతో ప్రపంచమంతా వణికిపోతోంది. తాత్కాలికంగా నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను వినియోగిస్తున్నారు. 
 
అయితే, భారత పారిశ్రామికదిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. సముద్ర భూగర్భంలో ఉండే ఎరుపు నాచుతో ఈ కరోనా వైరస్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ఈ ఎరుపు నాచుకు ఇన్ఫెక్షన్లను నిరోధించే శక్తి అధికంగా ఉందని తెలిపారు. 
 
పొర్ఫీరీడియం సల్ఫేటెడ్‌ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాకరైడ్‌లు శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైర్‌సల పాలిట బలమైన యాంటీ వైరల్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయని గుర్తించారు. 
 
అంతేకాకుండా, వీటితో యాంటీ వైరల్‌ ఔషధాలు తయారీతో పాటు శానిటరీ ఉపకరణాలపై వైరస్‌ దుర్భేద్యమైన కోటింగ్‌ వేయవచ్చని వెల్లడించవచ్చని ఓ అధ్యయన పత్రాన్ని విడుదల చేశారు. 
 
మరోవైపు రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ కూడా కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల అభివృద్ధిపై దృష్టిసారించినట్లు సమాచారం. తొలిదశగావాటితో గ్రూపు ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మార్కెట్‌లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు