తిరుమల శ్రీవారి ఆలయంలో నేతి దీపం వెలిగించేందుకు చోళరాజు బంగారం దానం

శుక్రవారం, 5 జూన్ 2020 (22:44 IST)
శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు ఆలయంలో దీపం వెలిగించడానికే ఇబ్బందిపడ్డారు. దీపం వెలిగించడం కోసమే విరాళాలు స్వీకరించారు. ఇలా స్వీకరించిన విరాళాలలో ఆవుల మందలే ప్రధానంగా వుండేవి. ఆలయంలో ఒక నేతిదీపం వెలిగించాలంటే…. 32 ఆవులు, ఒక ఆబోతు స్వామివారికి కట్నంగా స్వీకరించేవారట. ధనవంతులైతే 40 కొలంజుల బంగారం ఇచ్చేవారట. ఇది ఒక పద్ధతిగా ఆనాడు నిర్దేశించుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో క్రీ.శ. 830లో అప్పటి రాజులు ‘నందవిళక్కు’ అంటే ‘వెలుగుతున్న దీపం’ అనే పేరుతో నిత్యం నేతిదీపం వెలిగించే పద్ధతికి శ్రీకారం చుట్టారట. శాసనాల్లో చాలాచోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన వుంది. దీపాలను వెలిగించడానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చిందీ శాసనాల్లో రాశారు. దీపాలను వెలగించడానికి విరాళంగా వచ్చిన ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు. బంగారాన్ని శ్రీవారి భాండాగారానికి జమ చేసిన విధానమూ ఆనాడు అమల్లో వుంది.
 
క్రీ.శ.905 నుంచి క్రీ.శ.953 దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేశసరి… శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు నేతి దీపాలు వెలిగించడం కోసం ఒక్కో దీపానికి 40 కొలంజుల బంగారం దానం చేశారు. తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యుడైన విజయగండ గోపాలుని పట్టపురాణి దేవరసియార్‌ తిరుమల శ్రీవారి సన్నిధిలో 3 దీపాలు వెలిగించడానికి 32 ఆవులు, ఒక ఆబోతు, బంగారం దానం చేశారు. యాదవ రాజులలో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచిన వీరనరసింగదేవ యాదవరాయలు గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యం దీపారాధన కోసం 32 గోవులను, ఒక ఎద్దును దానం చేశారు. అలాగే తిరుమల ఆలయానికీ 32 ఆవులు, ఒక ఆబోతును దానం చేశారు.
 
ఇలా శాసనాల్లో పలుచోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తాయి. గోవులను పోషించడం, వాటిద్వారా వచ్చే పాల నుంచి వెన్నను, దాని నుంచి నెయ్యిని సేకరించి… దాంతో దీపాలు వెలిగించడమనేది ఒక పద్ధతిగా సాగింది. అందుకే శ్రీవారి తొలి సందప ఆలమందలే అయ్యాయి. ఈ లెక్కన అప్పట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అనిపిస్తుంది. ఇప్పటికీ స్వామివారికి ఆవులను కానుకగా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. తిరుమల, తిరుపతిలోని టిటిడి గోశాలలో ఉన్నవి అలా వచ్చిన ఆవులే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు