శ్రావణ శుక్రవారం : వరలక్ష్మిగా బెజవాడ కనకదుర్గమ్మ...

శుక్రవారం, 24 ఆగస్టు 2018 (08:50 IST)
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారంగా వస్తోంది. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు.
 
ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రావణ శుక్రవారం రోజున అనేక రాష్ట్రాల్లో ఐఛ్చిక సెలవు దినంగా ప్రకటిస్తారు. 
 
ఇకపోతే, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ వరలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తూ పూలు, పండ్లు, కానుకలు సమర్పిస్తున్నారు. కాగా... ఇంద్రకీలాద్రే గాక నగరంలో ఉన్న ఆయా దేవాలయాలు కూడా భక్తుల రద్దీతో నిండిపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు