కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేస్తారు? : గవర్నర్‌కు కేటీఆర్ ప్రశ్న

వరుణ్

శుక్రవారం, 26 జనవరి 2024 (17:01 IST)
ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ కోదండరాం‌ను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేయడం, ఆ పదవిపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎలా నామినేట్ చేసే అంశంపై మాజీ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితం నాటి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పేర్లను నామినేట్ చేస్తే గవర్నర్ తమిళిసై తిరస్కరించారని గుర్తుచేశారు. కానీ, ఇపుడు కోదండరామ్, అమిర్ అలీఖాన్‌ పేర్లకు ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, రాజకీయ సంబంధాలు ఉన్నాయనే కారణంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను తిరస్కరించిన గవర్నర్... ఈ రోజున ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్‌కు ఎలా ఆమోదం తెలిపాలని డిమాండ్ చేశారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నామినేట్ చేస్తే ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. నాడు శ్రవణ్‌ను ఎందుకు ఆమోదించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, సత్యనారాయణ సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. అందుకే వారిద్దరిని తాము నాడు నామినేట్ చేశామన్నారు. కానీ, గవర్నర్ తిరస్కరించారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్  తమిళిసై ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రమంతా చూస్తోందన్నారు. 
 
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేగాల మీద ఎలా సంతకం చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణకు రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలన్నారు. 
 
రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పని చేస్తున్నారని... రాజ్‌భవన్ నడుస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. గవర్నర్... సీఎం రేవంత్ రెడ్డికి బాధ్యులు కాదని, రాష్ట్ర ప్రజలకు బాధ్యులనే విషయం గుర్తెరగాలన్నారు. నాడు కనిపించిన రాజకీయ నేపథ్యానికి ఉన్న అభ్యంతరాలు నేడు ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా? అనే నిలదీశారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు