సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ .. ప్రైవేట్ ఆరోగ్య కార్డుల తరహాలోనే...

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (13:43 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల తరహాలోనే ప్రభుత్వం అందించే రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. పైగా ఈ కార్డు కింద అందించే చికిత్స జాబితాలో మరో వంద కొత్త వ్యాధులను చేర్చాలని భావిస్తున్నారు. ఒక్కో కుటుంబాన్ని ఒక్క యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీలతో ఈ కార్డులను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని భావిస్తున్నారు. ఈ కార్డులను కూడా వీలైనంత త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 
 
రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరిట జారీ చేసే ఈ హెల్త్ కార్డుల్లో కుటుంబంలోని ప్రతి సభ్యుడికి సబ్ నంబర్ ఇస్తారు. ఈ కార్డును హెల్త్ ప్రొఫైల్‌కు లింకు చేసి, రాష్ట్ర డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌కు అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో అందిస్తున్న చికిత్సలే కాకుండా, అదనంగా మరో వంద చికిత్సలను ఈ కార్డు పరిధిలోకి తీసుకుని రానున్నారు. ఇప్పటివరకు అందుబాటులో లేని ట్రామాకేర్‌ను కూడా చేర్చబోతున్నట్టు ప్రభుత్వ వైద్య వర్గాల సమాచారం. 
 
అదే జరిగితే లబ్దిదారులకు జరిగే మేలు అంతా ఇంతాకాదు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి యేటా అదనంగా రూ.400 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రభుత్వం ప్రస్తుతం యేటా రూ.1100 కోట్లు వెచ్చిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో మరింత భారం పెరిగింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు