ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం సుశాంత్ కల.. (video)

సోమవారం, 15 జూన్ 2020 (14:12 IST)
Sushant Singh Rajput
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భారత ప్రజలను కలచివేసింది. బాలీవుడ్‌లో క్రమక్రమంగా ఎదుగుతూ, తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఒక యువ నటుడు ఇలా ఉన్నట్టుండి చనిపోవడం పట్ల అంతా షాకయ్యారు. టీవీ సీరియల్స్ ద్వారా నట ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశాంత్ సింగ్‌కు చాలా కలలు ఉన్నాయి. ఆ కలలే ఆయన్ని బాలీవుడ్‌కి చేర్చాయి.
 
కై పో చే, డిటెక్టివ్ బ్యోమ్‌కేష్ భక్షి, ధోనీ, పీకే, కేదార్‌నాథ్, చిచ్చోరే వంటి చిత్రాలు ఆయనకు పేరుతెచ్చిపెట్టాయి. సినిమాలకు సంబంధించి సుశాంత్ సింగ్ కలలు క్రమంగా నెరవేరుతూ వచ్చాయి. కానీ, ఇంకా నెరవేరని కలలు చాలా ఉన్నాయి. ట్విట్టర్ వేదికగా తన కలలను ఆయన అందరితో పంచుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019 సెప్టెంబర్ 14వ తేదీన 'మై 50 డ్రీమ్స్ అండ్ కౌంటింగ్' పేరుతో మొదటి పేజీ ఫొటోను పెట్టారు. 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి కల ఒక విమానాన్ని నడపడం నేర్చుకోవడం. రెండో కల ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం. ఇందులో ఒక వ్యక్తి ఒక్క రోజులోనే 2.4 మైళ్లు స్విమ్మింగ్, 112 మైళ్లు సైకిల్ రైడింగ్, 26.22 మైళ్లు పరుగుపందెంలో పాల్గొనాల్సి ఉంటుంది. మూడు పందేలకూ నిర్ణీత సమయం ఉంటుంది. ఈ మూడింటిలో గెలుపొందిన వారికి ఐరన్ మ్యాన్ టైటిల్ ఇస్తారు.
 
సుశాంత్ సింగ్ మూడో కల ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడటం. ఎంఎస్ ధోనీ చిత్రంలో ఆయన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనీగా నటించిన సంగతి తెలిసిందే. 
 
నాలుగో కల మోర్సె కోడ్‌ నేర్చుకోవడం. ఐదో కల చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం. ఒక క్రికెట్ ఛాంపియన్ పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ ఆరోకల ఒక టెన్నిస్ ఛాంపియన్‌ పాత్రలో నటించడం. సుశాంత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా ఫిట్‌నెస్ వీడియోలు కనిపిస్తుంటాయి. ఆయన ఏడో కల కూడా దీనికి సంబంధించినదే.
 
నాలుగు క్లాప్ పుషప్‌లు చేయడం. ఈ ఏడు కలలతో మొదటి పేజీ పూర్తయ్యింది. కానీ, ఆయన కలలు కొన్ని పేజీల వరకు కొనసాగాయి. మొత్తం 50 కలలు కన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వాటిలో 11 పూర్తి చేశారు. మిగతావి ఇక పూర్తయ్యే అవకాశం లేదు. ఎందుకంటే..? ఆ కలలు కన్న కళ్లు ఆదివారం శాశ్వతంగా మూతపడిపోయాయి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు