నా భర్తకు ఏం కాలేదు... భేషుగ్గా ఉన్నారు... : జీవిత రాజశేఖర్

గురువారం, 22 అక్టోబరు 2020 (22:00 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ అరోగ్యం క్షీణించినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, తన తండ్రి ఆరోగ్యంపై రాజశేఖర్ పెద్ద కుమార్తె, హీరోయిన్ శివాత్మికం చేసిన ట్వీట్ సినీ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. 
 
దీంతో రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడంతో అందరూ కుదుటపడ్డారు. తాజాగా రాజశేఖర్ సతీమణి జీవితా రాజశేఖర్ మరింత స్పష్టతనిచ్చారు. 
 
ఎవరూ అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్ ఆరోగ్యంపై ఊహాగానాలు ప్రచారం చేయవద్దని, ఆయన ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉందన్నారు. క్రమంగా కోలుకుంటున్నారని, రాజశేఖర్ త్వరగా ఆరోగ్యవంతులవ్వాలని దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. తమ విషయంలో సానుకూల దృక్పథం చూపాలని అన్నారు.
 
కాగా, ఇటీవలే రాజశేఖర్‌తో బాటు.. ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. వీరిలో భార్య జీవితతో పాటు.. ఇద్దరు కుమార్తెలు కోలుకున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఇంకా హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేసింది. "కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది.. అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడుతాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు" అంటూ ట్వీట్ చేసింది. 
 
దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందారు. ఈ క్రమంలో జీవితా రాజశేఖరుతో పాటు.. ఆస్పత్రి వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. ఇదిలావుండగా, రాజశేఖర్ ఆరోగ్యంగా ఉన్నారనీ, అయితే, ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నప్పటికీ వెంటిలేటర్ అవసరం రాలేదని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు