కంగనా రనౌత్ స్వేచ్ఛను హరించలేం .. బాంబే హైకోర్టు

బుధవారం, 23 డిశెంబరు 2020 (09:41 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు నుంచి ఊరట లభించింది. కంగనా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పైగా, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరకీ ఉంటుందని అభిప్రాయపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగనా చేస్తోందని, తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కంగనాకు ఊరటను కల్పించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని తాము ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. 
 
ట్విట్టర్‌లో ఎవరికైనా ఖాతా ఉండొచ్చని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని చెప్పింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలని చెప్పలేమని వ్యాఖ్యానించింది. తీర్పును జనవరి 7న వెలువరిస్తామని చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు