వర్మ చాలా విజ్ఞానవంతుడు.. పవన్‌కు పోయేదేమీ లేదు : ప్రకాష్ రాజ్

బుధవారం, 29 జులై 2020 (19:20 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా కూడా తీశారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. రాంగోపాల్ వర్మ చాలా విజ్ఞానవంతుడు అని చెప్పారు. నిజానికి వర్మతో తాను ఎక్కువగా పని చేయకపోయినప్పటికీ... ఆయనను చాలా సార్లు కలిశానని ప్రకాశ్ రాజ్ చెప్పారు.
 
వర్మ నుంచి చాలా నేర్చుకోవచ్చన్నారు. ఆయన అందిరిలాంటి మనిషి కాదని... అలాగని అందరూ అనుకుంటున్నట్టు చెడ్డ మనిషి కూడా కాదన్నారు. ఆయనది ఒక విచిత్రమైన వ్యక్తిత్వమని అన్నారు. ఆయన తీసిన సినిమా మనకు నచ్చితే చూడొచ్చని, లేకపోతే వదిలేయొచ్చని చెప్పారు. తన సినిమా చూడమని వర్మ ఎవరినీ బలవంతం చేయడని అన్నారు.
 
ఇకపోతే, పవన్ కల్యాణ్ గొప్పదనం ఏమిటో అందరికీ తెలుసని... వర్మ తప్పుగా చూపించినంత మాత్రాన పవన్‌కు పోయేదేమీ లేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. పవన్ రేంజ్ చాలా ఎక్కువన్నారు. వర్మను అలా వదిలేయడమే మంచిదని అన్నారు. వర్మ తన పరిధిలో తాను ఉంటాడని ఆశిస్తున్నానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు