చెన్నైలో 5 నుంచి సూర్యకాంతం శతజయంతి వేడుకలు

శుక్రవారం, 3 నవంబరు 2023 (12:50 IST)
మహానటి దివంగత సూర్యకాంతం శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆమె కుమారుడు అనంతపద్మనాభమూర్తి, కోడలు ఈశ్వరీరాణీ, ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌లు నిర్ణయించారు. ఈ వేడుకలను ఈ నెల 5వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమవుతాయి. ఈ వేడుకల్లో భాగంగా, "తెలుగింటి అత్తగారు - సూర్యకాంతం" అనే పేరుతో ముద్రించిన సావనీర్‌ను విడుదల చేయనున్నారు. 
 
ఇది విషయంపై కుమారుడు అనంతపద్మనాభమూర్తి, కోడలు ఈశ్వరీ రాణి, ప్రముఖ సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్లు గురువారం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందుగా కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ, ఒక కుమారుడుగా తన తల్లి శతజయంతి వేడుకలను నిర్వహించాలని సంకల్పించినట్టు చెప్పారు. దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్లతో ఒక నిర్మాతగా కలిసి పనిచేశానని, కానీ సూర్యకాంతంతో తనకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ ఆ మహానటిపై తనకున్న ప్రత్యేక అభిమానంతో వీరికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక చెన్నైలోని టి.నగరులోని ఆంధ్రా క్లబ్ (ఆస్కా)లోని గోదావరి హాలులో ఈ వేడుకలను ప్రారంభవమవుతాయని చెప్పారు. ఈ వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగాను. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిర్ మాలా, డీఆర్ఎ (డెస్ట్ రికవరీ ట్రిబ్యునల్) న్యాయమూర్తి జయచంద్రలు అతిథులుగా హాజరవుతున్నారన్నారు. 'తెలుగింటి అత్తగారు సూర్యకాంతం' అనే పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరిస్తారని తెలిపారు. ఉపరాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమం కావడంతో నిర్ణీత సమయంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 
 
అనంతపద్మనాభమూర్తి మాట్లాడుతూ, మా అమ్మ సూర్యకాంతం శతజయంతి వేడుకలను ఆదివారం నుంచి ప్రారంభించి, వచ్చే యేడాది అక్టోబరు నెలాఖరు వరకు చేయాలన్న తలంపు ఉందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. తదుపరి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరం, ఆ తర్వాత కాకినాడ ఇలా ఒక్కో ప్రాంతంలో ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. దీన్ని పూర్తిగా మా కుటుంబమే నిర్వహిస్తుంటే, కాట్రగడ్డ ప్రసాద్ పూర్తి అండదండలు అందిస్తున్నారని, ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తన స్నేహితులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.
 
ఈ వేడుకల్లోనే తన తల్లి పేరుతో తీసిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శిస్తామన్నారు. అలాగే, చిన్నజీయర్ స్వామి పంపించిన వాయిస్ మెసేజ్లను ఆహుతులకు వినిపిస్తామన్నారు. కార్యక్రమం తర్వాత 'తెలుగింటి విందు' పేరుతో విందు భోజనం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఒక సావనీర్ను ముద్రించాలని ప్లాన్ చేయగా, అది ఏకంగా 500 పేజీలకు చేరిందన్నారు. 
 
ఇందుకోసం దేశ విదేశాల్లో ఉంటున్న వివిధ రంగాలకు చెందిన సినీ, పాత్రికేయ, నాటక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వారు వ్యాసాలు, రచనలను రాశారన్నారు. వీటిని మా తల్లి ఫోటోలతో ఎంతో అందంగా ముద్రించామని వివరించారు. కాగా, ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ సూర్యకాంతం శతజయంతి కమిటీ సభ్యులు డాక్టర్ తుమ్మపూడి కల్పన, గుడిమెళ్ళ మాధూరి, కొమ్మరాజు శివరామకృష్ణ, మీడియా సలహాదారుడు గుర్రం బాలాజీలు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు