నిన్న అమిత్ షా ... నేడు యడ్యూరప్ప.. కరోనా వైరస్ పాజిటివ్

సోమవారం, 3 ఆగస్టు 2020 (08:01 IST)
దేశంలో కరోనా వైరస్ ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. ముఖ్యంగా, అత్యంత సురక్షితంగా ఉండే రాజకీయ నేతలు ఈ వైరస్ బారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖామంత్రి కరోనా వైరస్ బారినపడి చనిపోయారు. ఆదివారం కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఈ వైరస్ బారినపడగా, సోమవారం కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఈ వైరస్‌కు చిక్కారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మణిపాల్‌ దవాఖానలో చేరారు. 'కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించారు. వైద్యుల సిఫారసు మేరకు ముందు జాగ్రత్తగా నేను దవాఖానలో చేరాను. ఇటీవల నన్ను సంప్రదించిన వారంతా గమనించి, స్వీయ నిర్బంధంలో ఉండాలని అభ్యర్థిస్తున్నాను' అని యడ్యూరప్ప ట్వీట్‌ చేశారు. 
 
కాగా, దేశంలో కరోనా వైరస్ బారినపడిన ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డులకెక్కారు. ఇపుడు యడ్యూరప్ప రెండో సీఎంగా నిలిచారు. వీరిద్దరూ బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. ఇకపోతే, ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లక్షణాలతో దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. 
 
అలాగే, శనివారం కర్ణాటకలో వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌తో పాటు ఆయన భార్య వైరస్‌ బారినపడ్డారు. అంతకు ముందు అటవీశాఖ, పర్యాటక శాఖ మంత్రులు ఆనంద్‌ సింగ్‌, సీటీ రవి కొవిడ్‌-19 సోకింది. మరోవైపు, కర్నాటకలో ఆదివారం కొత్తగా మరో 5,532 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 84 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1.34 లక్షల కేసులు పాజిటివ్‌గా ధ్రువీకరణ కాగా, మృతుల సంఖ్య 2,496కు చేరింది. 


 

I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.

— B.S. Yediyurappa (@BSYBJP) August 2, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు