గాన గంధర్వుడు ఇకలేరు: ఎస్పీ బాలసుబ్రమణ్యం జీవిత విశేషాలు (video)

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:34 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. గత ఆగస్టు 5న కరోనావైరస్ సోకడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబి ఆరోగ్యం నిన్న మరింత క్షీణించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన శుక్రవారం కన్నుమూశారు.
 
ఎస్పీ బాలు 1946 జూన్ 11న జన్మించారు. నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. మద్రాసులో AMIE కోర్సులో చేరారు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నారు బాలు. బాలసుబ్రహ్మణ్యం చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పని చేయాలని కలలు కనేవారు.
 
1966లో శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు. ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణి పై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
 
1969లో మొదటిసారిగా నటుడిగా పెళ్ళంటే నూరేళ్ళ పంట చిత్రంలో కనిపించారు.
 తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు.
 
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధలీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు.
 
అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు బాలు. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు.
 
1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 1981లో బాలీవుడ్‌లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 1983లో సాగర సంగమం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు.
 
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు బాలు. 2001లో పద్మశ్రీ, 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డాక్టరేటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా అందుకున్నారు. 2011లో పద్మభూషణ్, 2016లో శతవసంత భారతీయ చలనచిత్రోత్సవంలో పురస్కారం.
 
2012లో మిథునం చిత్రానికి గాను ప్రత్యేక నంది పురుస్కారం. సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించి.. అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసారు.
 
బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్. పి. చరణ్. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఆగష్టు 5న బాలు కరోనా వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరారు. నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించి నేడు ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు