వారి ప్రేమకు ఫలం భరతుడు, అదే భారతదేశం

మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (12:51 IST)
శకుంతలాదుష్యంతుల ప్రేమకథ మహాభారతంలోనిది. మహాభారతంలోని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని మహాకవి కాళిదాసు అజరామరమైన రీతిలో "అభిజ్ఞానశాకుంతలం" నాటకాన్ని రచించాడు.
 
అరణ్యానికి వేటకై వచ్చిన పురా వంశజుడైన దుష్యంత మహారాజుకు ముని పుత్రిక, ఆశ్రమకాంత శకుంతల తారసపడుతుంది. తొలిచూపులోనే ప్రేమలో పడిన వారిరువురు శకుంతల తండ్రి అనుమతి లేకుండానే గాంథర్వ రీతిలో ప్రకృతి మాత సాక్షిగా వివాహమాడుతారు. దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. శకుంతలను రాజస్థానానికి చేర్చేందుకు అవసరమైన పరివారాన్ని పల్లకి తోడుగా పంపుతానని దుష్యంతుడు, శకుంతలకు మాట ఇస్తాడు. తమ వివాహానికి గుర్తుగా ఒక ఉంగరాన్ని దుష్యంతుడు, శకుంతలకు అందజేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు.
 
ఇదిలా ఉండగా రుషులలో కోపిష్టి అయిన దుర్వాసుడు ఆతిథ్యం పొందేందుకై శకుంతల ఆశ్రమానికి వస్తాడు. అయితే దుష్యంతుని తలపులలో మునిగిపోయి ఊహాలోకంలో విహరిస్తున్న శకుంతల, దుర్వాసుని రాకను గుర్తించదు. శకుంతల ఏమరుపాటుకు ఆగ్రహించిన దుర్వాసుడు "నీవు ఎవరినైతే తలుచుకుంటున్నావో, వారు నిన్ను మరిచిపోదురుగాక" అని శపిస్తాడు. తన తప్పును తెలుసుకున్న శకుంతల శాపవిమోచన మార్గాన్ని తెలుపవలసిందిగా దుర్వాసుని అర్థిస్తుంది. "మీ ఇరువురికి సంబంధించిన ఏదైనా వస్తువును చూడటం ద్వారా నీ భర్త నిన్ను గుర్తిస్తాడు" అని శాపవిమోచన మార్గం తెలిపి వెడలిపోతాడు దుర్వాసుడు.
 
రోజులు దొర్లిపోతుంటాయి. శకుంతలను తీసుకువెళ్ళడానికి రాజస్థానం నుంచి ఎవ్వరూ రారు. గర్భవతి అయిన శకుంతలను దుష్యంతుని దగ్గరకు చేర్చేందుకు శకుంతుల తండ్రి సమాయత్తమవుతుంటాడు. అదేసమయంలో తమ ప్రేమకు గుర్తుగా దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని శకుంతల నదిలో పోగొట్టుకుంటుంది. తన ముందుకు వచ్చిన శకుంతలను శాపప్రభావంతో దుష్యంతుడు గుర్తుపట్టలేకపోతాడు. దుష్యంతుని నిరాకరణకు గుండె పగిలిన శకుంతల తనను భూమిపై నుంచి తీసుకుపోవలసిందిగా దేవతలను కోరుకుంటుంది.
 
అదేసమయంలో, శకుంతల జారవిడుచుకున్న ఉంగరాన్ని మింగిన చేప ఒక జాలరి వలలో పడుతుంది. చేపను కోసిన జాలరికి ఉంగరం కనపడుతుంది. ఉంగరాన్ని తీసుకువచ్చి దుష్యంతమహారాజుకు జాలరి అందిస్తాడు. అంతటితో శాపప్రభావం సమసిపోవడంతో దుష్యంతుడు, శకుంతలను గుర్తిస్తాడు. అపరాధ భావంతో పశ్చాత్తాపానికి గురైన దుష్యంతుని, శకుంతల క్షమిస్తుంది. ప్రేమ జంట ఒకటవుతుంది. వారి అనురాగాల పంటగా శకుంతల ఒక మగశిశువుకు జన్మనిస్తుంది. భరతుడనే పేరుతో పిలవబడిన అతని నుంచి భారతదేశానికి ఆ పేరు సంప్రాప్తిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు