ఓటర్లకు గాలం... ఎన్నికల ముంగిట మహిళలకు తాయిలం.. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం??

వరుణ్

బుధవారం, 31 జనవరి 2024 (13:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం తన సారథ్యంలో జరిగే మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వంపైపడే ఆర్థిక భారానికి సంబంధించిన నివేదికను ఆర్థిక శాఖ ఇప్పటికే తయారు చేసిన ప్రభుత్వానికి పంపించింది. 
 
ప్రస్తుతం ఇదే పథకం కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో సీఎం జగన్ మేల్కొని, అధికారంలో ఉన్నపుడే ఆ పథకాన్ని అమలు చేసి మహిళా ఓటర్లను తనవైపునకు తిప్పుకోవాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ పథకంపైనే బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.1440 కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా వేసింది. ఈ పథకం కారణంగా మహిళా ఓటర్లు వైకాపా ప్రభుత్వంపైపు మొగ్గే అవకాశం ఉందని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. 
 
అలాగే, వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేయలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా మంత్రిమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అంశంపై కేబినెట్‌లో చర్చించనున్నారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం, మెగా హౌసింగ్, నవరత్నాలు, పెద్దలందరికీ ళ్లు, రైతు భరోసా, సున్నా వడ్డీకే రుణాలు, ఇన్‍‌పుట్ సబ్సీడీ పంపిణీ, వంట బీమా, వ్యవసాయ రుణాల మాఫీ తదితర పథకాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు