చంద్రబాబుపై మరో కేసు నమోదు.. ఏఐజీ ఆస్పత్రిలో ఆడ్మిట్

శుక్రవారం, 3 నవంబరు 2023 (08:22 IST)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే, ఆయన వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడ నుంచి బుధవారం ఉదయానికి విజయవాడకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ ఏఐడీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసింది. 
 
ఓసారి ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సూచించారు. దీంతో గురువారం ఉదయం ఆయన ఏఐజీ ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించిన వైద్యులు.. ఆయన ఆస్పత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. కాగా, ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌తో ఆయన ఈ నెల 28వ తేదీ వరకు బయట ఉంటారు. 28వ తేదీన 4 గంటలకు తిరిగి జైలు సూపరింటెండెంట్‌ వద్ద హాజరవుతారు. 
 
మరోవైపు, చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు నమోదు చేయగా, తాజాగా నమోదు చేసిన కేసుతో కలిసి చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఏపీ ఎండీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వర రావు పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది ఐదో కేసు కావడం గమనార్హం. 
 
కాగా, చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం అనుమతుల మంజూరు కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. వీటిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, మొత్తం 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఆయన బుధవారం విడుదలైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు