ఆర్టీసీ బస్సు బీభత్సం... పంక్చర్ వేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.. నలుగురు మృతి

వరుణ్

సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:57 IST)
కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి పక్కన లారీకి పంక్చర్ వేస్తున్న వారిపైకి ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద ఈ దారుణం జరిగింది. ఈ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఒరిస్సా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. ఆ సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వెళ్తున్న మరో వ్యక్తి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్ వివరాలు తెలుసుకున్నారు. మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను సేకరించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు