మూడు రాజధానుల బిల్లుపై ఉత్కంఠ : న్యాయ సలహా కోరిన గవర్నర్

బుధవారం, 29 జులై 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మించతలపెట్టింది. అలాగే, అమరావతి రాజధాని అభివృద్ధి కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం బిల్లులు తెచ్చి, వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అక్కడ సంపూర్ణ మెజార్టీ ఉండటంతో వాటిని పాస్ చేయించుకుంది. కానీ, శాసనమండలిలో మాత్రం ఆ బిల్లులకు చుక్కెదురైంది. 
 
ఈ క్రమంలో ఇపుడు మూడు రాజధాను బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. వీటిని పరిశీలించిన గవర్నర్.. న్యాయసలహాను కోరారు. 
 
అంతకుముందు.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నరును కలిసి.. బిల్లుల ఆవశ్యకతో పాటు.. మూడు రాజధానులతో పాలనను వికేంద్రీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ఈ బిల్లులు అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లులపై గవర్నరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు