ఇళ్ల స్థలాల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: చినరాజప్ప

బుధవారం, 1 జులై 2020 (12:21 IST)
ఇళ్ల స్థలాల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

"రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో పెట్టారని మంత్రి స్థాయిలో బొత్సా తప్పుడు ఆరోపణలతో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.26వేల కోట్లు అప్పు చేస్తే జగన్ ప్రభుత్వం 13 నెలల్లోనే రూ.87వేల కోట్లు అప్పు చేశారు.

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నది జగన్ గాని చంద్రబాబు కాదు. చంద్రబాబు కొద్ది పాటి అప్పు చేసి పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయగా జగన్ పెద్ద మొత్తం అప్పు చేసినా అభివృద్ధి శూన్యం. దుబారా చేశారు. అవినీతి చేసి ప్రజాధనం మింగేశారు.

బొత్సా మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో చంద్రబాబు నెత్తిన రూ.32వేల కోట్లు బకాయిలు పెట్టారు. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ పెట్టారు. కేవలం రూ.1,1,2000 కోట్ల బడ్జెట్ న్న చంద్రబాబు గతాన్ని నిందించకుండా ఆదాయం పెంచి బకాయిలు తీర్చారు. 

రూ.2,24,000 కోట్ల బడ్జెట్ ఉన్న జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం పడ్డ బకాయిలు ధామాషాతో పోలిస్తే తక్కువే. అయినా తమ చేత గాని తనాన్ని, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బకాయిలపై పదే పదే అబద్దాలు మాట్లాడుతున్నారు.

గతంపై నిందలు వేసేది అసమర్దులు మాత్రమే. ఇళ్ల స్థలాల అవినీతిపై బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి ఉన్నారు. వైకాపా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులే విమర్శించి ఉన్నారు. ఎందరిపై చర్యలు తీసుకొన్నారో బొత్సా చెప్పలేక పోయారు. స్కాం కోసమే ఇళ్ల స్థలాల స్కీం పెట్టారనేది వాస్తవం.

ఇళ్ల స్థలాలకు బడ్జెట్ లో రూ.8వేల కోట్ల కేటాయించారు. ఈ రూ.8వేల కోట్లు బ్యాంకు లింకేజితో ఖర్చు చేసి ఉంటే20 లక్షల పక్కా ఇళ్లు పేదలకు వచ్చి ఉండేవి. గృహ నిర్మాణంలో భారీ స్కాం చేయలేమని ఇళ్ల స్థలాల స్కీం పెట్టింది నిజం కాదా? రూ.8వేల కోట్లల్లో రూ.5వేల కోట్లు అవినీతి జరిగింది.

దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే ధైర్యం జగన్  ప్రభుత్వానికి ఉన్నదా? చంద్రబాబు గృహ నిర్మాణాలు చేయలేదనే బొత్సా ఆరోపణ పచ్చి అబద్దం. వారి ప్రభుత్వమే చంద్రబాబు రూ.8 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసిందని ప్రకటించింది. 

అంతర్జాతీయంగా అంబులెన్స్ సర్వీస్ లో అనుభవమున్న సంస్థను అర్ధాంతరంగా తప్పించి, రేట్లు పెంచి అనుభవం లేని విజయసాయిరెడ్డి అల్లుడుకు ఎందుకు కట్టబెట్టారు? రూ.307 కోట్లు అవినీతి జరిగితే విజయసాయిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?

అమరావతో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన జగన్ మడమ తిప్పి వైజాగ్ లో బలవంతంగా లాండ్ పూలింగ్ పేరిట 6వేల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితరుల భూములు స్వాధీనం చేసుకున్నది బహిరంగ రహస్యం. ఈ వాస్తవానికి విరుద్దంగా బొత్సా మాట్లాడటం అబద్దమని విశాఖ వాసులకు తెలియదా?

ఇళ్ల స్థలాల పేరిట రూ.5 వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నది. జ్యుడీషియల్ విచారణ ఆదేశించక పోతే స్కాం అంగీకరించనట్లే. అబద్దాలతో అక్రమ కేసులతో వాస్తవాలను ఎల్లకాలం దాచలేరని జగన్ ప్రభుత్వం గుర్తించాలి. పద్దతి మార్చుకోవాలి" అని హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు