చైనా వస్తువులకు కూడా భారత్‌లో చెక్..? అమేజాన్ ఆ హామీ ఇచ్చిందిగా?

గురువారం, 16 జులై 2020 (20:21 IST)
చైనా యాప్‌లకు భారత ప్రభుత్వం చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా వస్తువులకు చెక్ పెట్టేందుకు భారత్ మరో అడుగు ముందుకు వేసింది. దేశంలో అమ్మే అన్ని ఉత్పత్తులపై అవి ఎక్కడ తయారు చేశారో కచ్చితంగా పేర్కొనాలంటూ ఈ కామర్స్ సంస్థలకు వాణిజ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన అమెజాన్, భారత వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొంది.
 
అంతేగాకుండా తమ వెబ్ సైట్ ద్వారా అమ్మకం చేసే ప్రతి ఉత్పత్తిపై ఆ దేశం పేరు కూడా తప్పకుండా వుండేలా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశం పేరు వుండేలా అమ్మకపుదారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 10వ తేదీలోగా వస్తువులకు సంబంధించిన జాబితాను ఇవ్వాలని కోరింది. అమేజాన్ కంపెనీ చైనాలో తయారయ్యే అనేక వస్తువులను భారత్‌లో తమ సైట్ ద్వారా విక్రయిస్తుంది. ముఖ్యంగా చైనాలో తయారయ్యే అనేక మొబైల్స్ ఇండియాలో విక్రయిస్తుంటారు. 
 
కాగా కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రధాని మోడీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించారు. దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్యాకేజీలో అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మన అవసరాలకు తగిన విధంగా ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు అనేక దేశీయంగా అనేక కంపెనీలు ముందుకు వచ్చి ఉత్పత్తి చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు